Share News

ఏపీ నుంచి.. నలుగురూ ఏకగ్రీవం

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:14 AM

రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌ (టీడీపీ), లింగమనేని రమేశ్‌....

ఏపీ నుంచి.. నలుగురూ ఏకగ్రీవం

  • జెన్‌ జీ ఓటర్లు కూటమితోనే ఉన్నారు

  • ఈడీ భయంతో జగన్‌కు వణుకు

  • ఐదేళ్లలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వ్యక్తి డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు

  • ఎంపీలు విజయ్‌, రామకృష్ణ ఫైర్‌

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌ (టీడీపీ), లింగమనేని రమేశ్‌ (జనసేన) తప్ప వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించింది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణలకు అమరావతి అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వనితారాణి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సానా సతీశ్‌, లింగమనేని రమేశ్‌ల పత్రాలను వారి ప్రతినిధులకు అందించారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం రామకృష్ణ, విజయ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. వీరికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌ డైవర్షన్‌ రాజకీయాలు: విజయ్‌

ఈడీ భయంతోనే జగన్‌ డైవర్షన్‌ రాజకీయాలకు తెర తీశారని చింతకాయల విజయ్‌ మండిపడ్డారు. జెన్‌ జీ ఓటర్లు కూటమితోనే ఉన్నారని.. మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో దేశంలో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయని మీడియాకు తెలిపారు. ‘జగన్‌కు ఈడీ దాడుల భయం పట్టుకుంది. తన పీఏతోపాటు కసిరెడ్డిని చుట్టుముట్టడంతో తన దాకా వస్తుందనే వణుకు ఆయనలో ప్రారంభమైంది. దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో మీడియా ముందుకొచ్చారు. వెన్నుపోటు, గొడ్డలి పార్టీ, కోడికత్తి, డైవర్షన్‌ రాజకీయాలకు ప్యాంటు, షర్టు వేస్తే అది జగన్‌రెడ్డే. దగా, మోసం, వెన్నుపోటుకు అడ్రస్‌ ఆయనే. అందరినీ నాశనం చేసి ఏడ్చినట్లుగా ఆయన తీరు ఉంది. అందుకే మెగా డీఎస్సీలో అక్రమాలు, వెన్నుపోటు అంటూ డ్రామాలు అడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చారా? కాక్రోచ్‌, జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా అంటూ కొత్త కొత్త పదాలు వాడుతున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు జెన్‌జీ గట్టి గుణపాఠం చెప్పింది. జెన్‌ జీ, అదే జెన్‌ ఆల్ఫా.. 151 సీట్లను 11కు తీసుకొచ్చారు. కాక్రోచ్‌లు వస్తున్నాయని ఆయన అంటున్నారు. అవన్నీ జగన్‌ కోసమే వస్తున్నాయి.. మా కోసం కాదు. ఒక ఫ్యాక్షనిస్టు, ఒక ఫాసిస్టు.. తనకు అన్యాయం జరుగుతోందని ఏడిస్తే నమ్మే స్థితిలో జనం లేరు. బీసీల నుంచి నన్ను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం చంద్రబాబుకు, లోకేశ్‌కు ధన్యవాదాలు. కార్యకర్తే అధినేత అన్నది నినాదమే మాత్రమే కాదు. నా ఎంపికతో అది నిజమని పార్టీ అధిష్ఠానం రుజువు చేసింది. బీసీలకు టీడీపీలో ఎప్పుడూ న్యాయం జరుగుతూనే ఉంటుంది’ అని చెప్పారు.


వారి భవిష్యత్‌ నాశనం చేయాలని..: రామకృష్ణ

అధికారంలో ఉండగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్‌.. ఇప్పుడు 16 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు పోగొడతా అన్నట్లు వ్యవహరిస్తున్నారని భాష్యం రామకృష్ణ విమర్శించారు. ‘డీఎస్సీపై నిరాధార ఆరోపణలతో గందరగోళం సృష్టించాలనే మాటలను ప్రజలు విశ్వసించరు. టీచర్‌ ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది భవిష్యత్‌ను అంధకారంలో పడేయాలని జగన్‌ చూస్తున్నారు. తన డైవర్షన్‌ పాలిటిక్స్‌కు డీఎస్సీని వాడుకుంటున్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనకు సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రయత్నిస్తాం. నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

Updated Date - Jun 12 , 2026 | 04:14 AM