ఏపీకి మరో రైల్వే ప్రాజెక్టు
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:32 AM
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, తమిళనాడులోని..
గూడూరు-గుమ్మిడిపుండి మధ్య మరో 2 లైన్లు.. 2,229 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
ఏపీ, తమిళనాడుకు మరింత కనెక్టివిటీ.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. నాలుగేళ్లలో పూర్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మిడిపుండి మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్(వీసీఐసీ) పరిధిలో, అలాగే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో కీలక భాగమైన గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్ మధ్య రూ.2,229 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్లను కేంద్రం నిర్మించనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులతో పాటు బిహార్‌లోని ఎన్‌హెచ్-22లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్‌బర్సా విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హెచ్‌ఏఎమ్) కింద నాలుగు లైన్ల రహదారిని రూ.3,591 కోట్లతో ఆధునీకరించడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గూడూరు-గుమ్మిడిపుండి మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణాన్ని 90 కిలోమీటర్ల పొడవున నాలుగేళ్లలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద బ్రిడ్జిలు, 127 చిన్న బ్రిడ్జిలు, 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్లతో పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం, వీరరాఘవ పెరుమాళ్ ప్రభు ఆలయానికి మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడనున్నట్లు తెలిపారు. కొత్త రైల్వే ప్రాజెక్టులతో దాదాపు 60 లక్షల జనాభా ఉన్న దాదాపు 6,448 గ్రామాలకు మెరుగైన రైలు అనుసంధానాన్ని ఈ ప్రతిపాదిత మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు అందించడంతో పాటు మరో 410 కిలోమీటర్ల మేర భారతీయ రైల్వే నెట్‌వర్క్ విస్తరించనుంది. ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.