వరద జలాలను.. ఏపీ వాడుకుంటేనష్టమేంటి?
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:09 AM
గోదావరి వరద జలాలను దిగువ, చిట్టచివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేమిటని కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ తెలంగాణను ప్రశ్నించారు.
తెలంగాణను ప్రశ్నించిన జలసంఘం చైర్మన్.. పోలవరం-బనకచర్లకే కట్టుబడి ఉన్నాం: ఆంధ్రప్రదేశ్
అందులో భాగంగానే తొలి దశలో నల్లమలసాగర్ వరకు చేపడుతున్నాం
టన్నెళ్లు, కాలువల తవ్వకానికి సమయం పడుతుంది
అందుకే నల్లమలసాగర్ వరకే డీపీఆర్ తయారీ
కృష్ణా జలాల్లో చెరిసగం వాటాకు అంగీకరించం
ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు స్పష్టీకరణ
ఢిల్లీలో ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరద జలాలను దిగువ, చిట్టచివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేమిటని కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ తెలంగాణను ప్రశ్నించారు. ఉభయ రాష్ట్రాల నడుమ నీటి సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఢిల్లీలో ఆయన అధ్యక్షతన కేంద్రం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం జరిగింది. రెండు గంటలపాటు చర్చ జరుగగా.. తెలంగాణ తన ఎజెండా అంశాలను ఇవ్వలేదు. ఏపీ ఇచ్చిన ఎజెండాను జలసంఘం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించింది. 66:34 నిష్పత్తిలో కాకుండా కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరిసగం పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణ జరుపుతున్నందున.. కేటాయింపులపై రాష్ట్రాలు అభిప్రాయాలను వెల్లడించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా గోదావరి జలాల కేటాయింపులు లేకుండానే పొరుగు రాష్ట్రం కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను నిర్మించలేదా అని నిలదీసింది. కమిటీ సమావేశం అనంతరం రాష్ట్రప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘గోదావరి వరద జలాల ఆధారంగా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడాన్ని తెలంగాణ ప్రశ్నించింది. అయితే ఎగువ రాష్ట్రాలు వారి హక్కుల ప్రకారం వినియోగించుకున్న తర్వాతే.. పోలవరం నుంచి సముద్రంలో వృధాగా కలిసిపోయే వరద జలాలతోనే బనకచర్ల పథకానికి రూపకల్పన చేశామని మేం స్పష్టం చేశాం. పోలవరం-బనకచర్ల పథకానికే కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పాం. ఈ పథకంలో భాగంగానే తొలిదశలో నల్లమలసాగర్ వరకు ప్రాజెక్టు చేపడుతున్నాం. టన్నెళ్లు, కాలువల నిర్మాణానికి సమయం పట్టనున్నందున.. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయిస్తున్నాం. వృధాగా పోయే వరద జలాలతో పథకాన్ని రూపొందిస్తే తప్పేమిటని జలసంఘాన్ని మేం ప్రశ్నించాం. ఆంధ్రప్రదేశ్ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం.. బనకచర్ల అనుసంధాన పథకానికి ఎందుకని నిలదీశాం’ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలను, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారని గుర్తుచేశారు. అయితే ఈ వాటాను చెరి సగం చేయాలన్న తెలంగాణ వాదనను తాము తోసిపుచ్చామని చెప్పారు. ఇది కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశామన్నారు.
వారం గడువిస్తే ఎజెండా సమర్పిస్తాం: తెలంగాణ
కమిటీ ఎజెండాలో నల్లమలసాగర్ ప్రాజెక్టును చేర్చవద్దని తెలంగాణ కోరింది. వారం రోజులు గడువిస్తే తమ ఎజెండాను పంపుతామని తెలిపింది. ఇందుకు జలసంఘం అంగీకరించింది. ఇప్పటికే ఏపీ తన ఎజెండాను పంపినప్పటికీ.. ఇంకొన్ని అంశాలను కలిపి మరోసారి పంపాలని కోరింది. సదరు ఎజెండాలపై రెండు రాష్ట్రాలూ 15 రోజుల్లో పరస్పరం అభిప్రాయాలు చెప్పాలని.. ఆ తర్వాత మరోసారి కమిటీ సమాశం ఉంటుందని చైర్మన్ అనుపమ్ ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారంనాటి భేటీలో ఏపీ తరఫున ఈఎన్‌సీ నరసింహామూర్తి, అంతర్రాష్ట్ర జలవివాదాల విభాగం సీఈ సుగుణాకరరావు, ఎస్‌ఈ గిరిధర్‌రావు.. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జె పాటిల్, ఈఎన్‌సీ మహ్మద్ అమ్జాద్ హుస్సేన్, సీఈ ప్రసాద్ హాజరయ్యారు.