Share News

విశాఖ, బెజవాడ మెట్రోలకు అనుమతులివ్వండి

ABN , Publish Date - May 21 , 2026 | 04:23 AM

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు రాష్ట్ర మంత్రి పి.నారాయణ విజ్ఞప్తి చేశారు.

విశాఖ, బెజవాడ మెట్రోలకు అనుమతులివ్వండి

  • కేంద్ర మంత్రి ఖట్టర్‌కు మంత్రి నారాయణ వినతి

  • స్వచ్ఛభారత్‌ 2.0 జాతీయ సదస్సుకు హాజరు

న్యూఢిల్లీ, అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు రాష్ట్ర మంత్రి పి.నారాయణ విజ్ఞప్తి చేశారు. బుధవారం ‘స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0’పై జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన నారాయణ.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై నివేదిక కేంద్రానికి అందిందని, ఆ మార్గంలో 13 కి.మీ. మేర డబుల్‌ డెక్కర్‌ లైన్‌ ఏర్పాటు చేసేలా రైట్స్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైట్స్‌ నివేదిక ప్రకారం అనుమతులు జారీ చేసి త్వరగా ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.

ప్రజా ఉద్యమంగా స్వచ్ఛభారత్‌: నారాయణ

అంతకుముందు స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0పై కేంద్ర మంత్రి ఖట్టర్‌ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఏపీ నుంచి మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సంపత్‌ కుమార్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ అనిల్‌ కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఏపీలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను అమలుచేస్తున్న తీరును నారాయణ వివరించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను తెలియజేశారు. రాష్ట్రాన్ని డంపింగ్‌ యార్డ్‌ రహితంగా మార్చేలా వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెలా మూడో శనివారం ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌-2.0ను ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రజా ఉద్యమాలుగా మార్చే దిశగా చర్యలు చేపట్టామన్నారు.

Updated Date - May 21 , 2026 | 04:23 AM