అమరావతిలో నిఫ్ట్, కుప్పంలో పీఎం మిత్రా పార్క్
ABN , Publish Date - May 30 , 2026 | 06:01 AM
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు.
ఏర్పాటుకు సహకరించండి
కేంద్ర మంత్రి గిరిరాజ్‌ను కోరిన సీఎం చంద్రబాబు
అరటి పీచు వెలికితీత కేంద్రాల ఏర్పాటుకూ వినతి
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ముందు సీఎం ఈ ప్రతిపాదన ఉంచారు. ఫైబర్ టు ఫ్యాషన్‌కు అనుకూలించేలా పీఎం మిత్రా పార్కు 2.0ను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అవసరమైన రూ.280 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిఫ్ట్ కోసం అమరావతిలో పదెకరాలు కేటాయించామన్నారు. ఏపీలోని వివిధ వస్త్ర పరిశ్రమ క్లస్టర్లలో ఇంటిగ్రేటెడ్ వెట్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్ కింద ఏపీని ప్రాధాన్యత రాష్ట్రంగా గుర్తించాలన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం కింద మంగళగిరిలో రూ.22.36 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో చేనేత హస్త కళల మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలన్నారు. కాగా, ఏపీలో వేర్వేరు ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్‌కు ప్రోత్సాహం కల్పించాలని సీఎం కోరారు. రాయలసీమ సహా కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతోందని, దీనికి వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు అవకాశాలను పరిశీలించాలని కోరారు.
పీచు వెలికితీతతోపాటు వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడే ఉద్యాన పంటల నివేదికను సీఎం కేంద్రమంత్రికి సమర్పించారు. వస్త్ర పరిశ్రమతో పీపీపీ భాగస్వాముల ద్వారా వెదురుకు సంబంధించిన మెకానికల్ ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. చాపలు, జియో టెక్స్‌టైల్ రోల్స్, కాంపోజిట్ బోర్డుల తయారీకి ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వీటి తయారీకి ఆస్కారం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమను బలోపేతం చేసేలా ప్రస్తుత కాయర్ బోర్డు డ్వాక్రా నెట్‌వర్క్ ద్వారా మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు జౌళి శాఖ సహకారం కావాలని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనలపై స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్.. ఏపీకి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.