Share News

సారీ.. క్షమించండి!

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:33 AM

ఎమ్మెల్సీగా ఉన్న సమయలో దీపక్‌రెడ్డికి పీఏని కేటాయించకుండా జాప్యం చేసిన కేసులో అప్పటి అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు శాసనమండలి ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు.

సారీ.. క్షమించండి!

  • మండలి ప్రివిలేజ్‌ కమిటీకి అధికారుల సంజాయిషీ

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీగా ఉన్న సమయలో దీపక్‌రెడ్డికి పీఏని కేటాయించకుండా జాప్యం చేసిన కేసులో అప్పటి అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు శాసనమండలి ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. అసెంబ్లీ కమిటీ హాలులో గురువారం బీటీ నాయుడి అధ్యక్షతన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం జరిగింది. దీపక్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై గంధం చంద్రుడిని, అప్పటి డీఆర్వోని కమిటీ పిలిపించి విచారించింది. జాప్యంపై గంధం చంద్రుడు సారీ చెప్పగా.. డీఆర్వో మాత్రం డొంక తిరుగుడు సమాధానం చెప్పడంతో కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని ఆమెను హెచ్చరించింది. మరో కేసులో.. ప్రస్తుత ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ బీటీ నాయుడు విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన సమయంలో అతిథిగృహం కోసం అప్పటి డీఆర్వో భవానీ శంకర్‌కు ఫోన్‌ చేయగా.. కర్నూలు ఎమ్మెల్సీకి విశాఖలో అతిథిగృహం కేటాయించడం కుదరదని సమాధానం చెప్పారు. దీనిపై ఆయన ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా భవానీ శంకర్‌ను కమిటీ పిలిపించి, ప్రశ్నించింది. భవానీ శంకర్‌ సమాధానమిస్తూ.. పొరపాటైందని.. మళ్లీ ఇలా జరక్కుండా చూసుకుంటానని అన్నారు. జంగా కృష్ణమూర్తి, ఐజాక్‌ బాషా, రమేశ్‌ యాదవ్‌ల ఫిర్యాదులపైనా కమిటీ విచారించింది.

Updated Date - Jan 30 , 2026 | 05:33 AM