Share News

ఖైదీల సొమ్ముకూ కక్కుర్తి!

ABN , Publish Date - May 04 , 2026 | 03:58 AM

జైళ్లలో పెట్రోల్‌ బంకుల ఆదాయం అడ్డగోలుగా దారిమళ్లుతోంది. అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారులు సంక్షేమ ఫండ్‌ ఆడిట్‌ జరగకుండా ఇన్నాళ్లూ జాగ్రత్తపడ్డారు.

ఖైదీల సొమ్ముకూ కక్కుర్తి!

  • పెట్రోలు బంకుల ఆదాయం భారీగా మళ్లింపు

  • జైళ్లశాఖలో పక్కదారి పట్టిన కోట్ల రూపాయలు

  • నెలలోగా చెల్లించకపోతే చర్యలు: ప్రిజన్స్‌ డీజీ

  • 15ఏళ్ల సంక్షేమ నిధిపై ఆడిట్‌ చేపట్టాలని ఆదేశం

  • సీసీ కెమెరాలు, లైవ్‌ వైర్‌తో భద్రత కట్టుదిట్టం

  • పదోన్నతులు, పారదర్శక బదిలీలపై హర్షం

జైళ్లలో ఖైదీలను సంస్కరించాల్సిన కొందరు జైలు అధికారులు వారి సొమ్ముల కోసం కక్కుర్తి పడ్డారు. ఏపీ జైళ్ల శాఖ పరిధిలోని పెట్రోలు బంకుల నుంచి వచ్చే ఆదాయాన్ని భారీగా దారి మళ్లించారు. ఖైదీల సంక్షేమానికి వినియోగించాల్సిన రూ.కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారు.

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): జైళ్లలో పెట్రోల్‌ బంకుల ఆదాయం అడ్డగోలుగా దారిమళ్లుతోంది. అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారులు సంక్షేమ ఫండ్‌ ఆడిట్‌ జరగకుండా ఇన్నాళ్లూ జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు ఆ అధికారులకు ఇన్‌చార్జి డీజీ బాలసుబ్రహ్మణ్యం షాక్‌ ఇచ్చారు. గత 15ఏళ్లకు సంబంధించి మొత్తం ఆడిట్‌ చేపట్టాలని ఆదేశాలివ్వడంతో రూ.కోట్లు స్వాహా చేసిన అవినీతి అధికారులు వణుకుతున్నారు. రాష్ట్రంలోని నాలుగు కేంద్ర కారాగారాలు, ఎనిమిది జిల్లా జైళ్లు, 90 వరకూ ఇతర సబ్‌ జైళ్లలో సుమారు 7వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. నేర నిరూపణతో జైలుకొచ్చిన ఖైదీల్ని సంస్కరించి శిక్షాకాలం పూర్తయ్యాక వారిని మరోమారు తప్పు చేయకుండా ఉండేలా బయటికి పంపిస్తారు. ఈ ప్రక్రియకు అవసరమైన నిధులను పెంట్రోలు బంకుల ద్వారా జైళ్ల శాఖ సమకూర్చుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల ప్రాంగణాల్లో 25 పెట్రోలు బంకులు ఉండగా ప్రతి నెలా కనీసం రూ.కోటి తగ్గకుండా ఆదాయం వస్తోంది.


ఈ సొమ్మును ఖైదీల సంక్షేమానికి వినియోగించాల్సి ఉంది. అయితే కొందరు అవినీతి అధికారులు తమ విలాసాల కోసం ఆ నిధులను పక్కదారి పట్టించారు. అనధికారిక సమాచారం మేరకు.. ఖైదీల సంక్షేమ నిధి నుంచి వచ్చే వడ్డీని వీరు సొంతానికి వాడేసుకున్నట్లు పక్కా ఆధారాలు బయట పడటంతో జైళ్ల శాఖ ఇన్‌చార్జి డీజీ తాజాగా ఏకధాటిన 12 గంటల పాటు సమీక్షించారు. రూ.కోట్ల విలువైన పెట్రోలు, డీజీలు అప్పుగా పోశామని కొందరు అధికారులు చెప్పడంతో వెంటనే ఆ మొత్తం వసూలు చేయాలని, ఇకపై ప్రతినెలా 10వ తేదీ లోపు పెట్రోలు బంకుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమ నిధిలోకి జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకూ ఖైదీల సంక్షేమ నిధి రూ.100 కోట్లు ఉన్నట్లు తేలినా మరో రూ.20 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్లు తేలింది. అందులో రూ.12కోట్లు వెంటనే చెల్లించాలని, మిగతా మొత్తం నెల రోజుల్లో జమ చేసేందుకు గడువు ఇచ్చినట్లు తెలిసింది. డబ్బులు చెల్లించకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని డీజీ హెచ్చరించడంతో బాధ్యులైన అధికారుల గుండెల్లో రాయి పడిందని సమాచారం. కార్పస్‌ ఫండ్‌, సిబ్బంది సంక్షేమ నిధి ఖర్చుల వివరాల్లో అవకతవకలు కనిపించడంతో 15ఏళ్ల నుంచి పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించాలని బాలసుబ్రహ్మణ్యం ఆదేశించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.


సిబ్బందిలో సంతోషం

గతేడాది జైళ్ల శాఖ సిబ్బంది బదిలీల సందర్భంగా అధికారుల బేరసారాలపై బహిరంగ విమర్శలు వచ్చాయి. వీటన్నింటికి చెక్‌ పెడుతూ మూడేళ్లు దాటిన అందరినీ బదిలీల పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ మూడు ఆప్షన్లు ఇచ్చి, వారి ప్రాంతానికి 200 కి.మీ. దూరంలోపు పనిచేసేలా డీజీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శాఖలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పదోన్నతి లభించింది. సోమవారం వందల మందికి పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే ఆవకాశం ఉంది. డీజీ చొరవతో పూర్తి పారదర్శకంగా బదిలీలు నిర్వహించడంతో పాటు పదోన్నతుల ఫైల్‌కు ఎట్టకేలకు మోక్షం లభించడంతో సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రతకు అత్యంత ప్రాధాన్యం

రాష్ట్రంలోని జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోతున్న ఖైదీల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీలు, మెటల్‌ డిటెక్టర్లు, సెల్‌ఫోన్‌ డిటెక్టర్లు కొనుగోలు చేయాలన్న కసరత్తు మూడేళ్లుగా సాగుతున్నా కొలిక్కి రాలేదు. అవసరం మేరకు వాటిని వెంటనే కొనుగోలు చేయడంతో పాటు అన్ని జైళ్లలోనూ ప్రహరీలపై లైవ్‌ విద్యుత్‌ వైర్‌ ఏర్పాటు చేయాలని తాజా సమీక్షలో డీజీ నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్ల పరిధిలో ఉన్న భూముల్ని గుర్తించి కంచె ఏర్పాటు చేసి కాపాడాలని ఆదేశాలిచ్చారు.

అమరావతిలో సెంట్రల్‌ జైలు.. ట్రైనింగ్‌ సెంటర్‌

రాష్ట్రంలో ప్రస్తుతం కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో నాలుగు కేంద్ర కారాగారాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో అధునాతన కేంద్ర కారాగారంతో పాటు సిబ్బంది శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం మంజూరు చేసిన రూ.200 కోట్ల నిధులతో సెంట్రల్‌ జైలు నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో బోస్టల్‌ స్కూల్‌ (మైనర్ల కారాగారం) లేకపోవడంతో తక్షణమే నెల్లూరు కేంద్ర కారాగారంలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయడంపైనా సమీక్షలో చర్చించారు.

Updated Date - May 04 , 2026 | 03:58 AM