Share News

పీపీపీ మెడికల్‌ కాలేజీలు..నెలలో పట్టాలెక్కాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:57 AM

రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్‌ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పీపీపీ మెడికల్‌ కాలేజీలు..నెలలో పట్టాలెక్కాలి

  • ఫేజ్‌-1లో నాలుగు ప్రారంభించండి

  • హెల్త్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పాలసీని సిద్ధం చేయండి: చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్‌ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్‌ మేనేజ్మెంట్‌పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పీపీపీ విధానంలో ఫేజ్‌-1లోని మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్‌ కాలేజీల పనులు ప్రారంభించాలని చెప్పారు. ఫేజ్‌-2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏడు పిల్లర్లతో ఏపీ స్టేట్‌ హెల్త్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పాలసీ 2026-31ని త్వరలోనే తీసుకురావాలని నిర్ధేశించారు. అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో నేచురోపతి కేంద్రం నెలకొల్పేలా ఆయుష్‌ శాఖకు లేఖ రాయాలని సూచించారు. ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేలా ప్రివెంటివ్‌ హెల్త్‌ విధానం, సిటిజెన్‌ హెల్త్‌ స్ర్కీనింగ్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఇందుకోసం పబ్లిక్‌ హెల్త్‌ డేటాను వినియోగించుకోవాలన్నారు. సంజీవని ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎనీమియా, డయాబెటిస్‌ వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.1 నుంచి 1.5కి తగ్గిందని, అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఫెర్టిలిటీ రేట్‌ ఉంటే, అత్యల్పంగా 1.32 విశాఖలో నమోదైందని అధికారులు తెలిపారు. ఫెర్టిలిటీ రేటు 2.1 లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, దీనిని కాపాడేకునేందుకు మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలన్నారు. ఉమ్మడి పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జనాభా నిర్వహణ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని.. పోషకాహారం, ప్రివెంటివ్‌ హెల్త్‌పై దృష్టి పెట్టేలా చూడాలన్నారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా, ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వారి రికార్డుల ఆధారంగా డైట్‌, పోషకాహారం అందించాలని చెప్పారు.

Updated Date - Apr 23 , 2026 | 03:57 AM