విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం రానీయొద్దు
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:07 AM
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్తు ఉత్పత్తికి ఎలాంటి అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 15 రోజులకు....
థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన గొట్టిపాటి
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్తు ఉత్పత్తికి ఎలాంటి అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ఉంచుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్‌కో పరిధిలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 80 శాతానికిపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)సాధించామని, వైసీపీ హయాంలో ఇది 50 శాతం లోపే ఉండేదని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం సూచనల మేరకు జెన్కోను మరింత బలోపేతం చేయాలని, విద్యుత్తు కొనుగోళ్లను మరింత తగ్గించాలని ఆదేశించారు. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలు తీర్చేలా బీఈఎస్ ఎస్ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ) నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.