త్వరలో విద్యుత్ ఏఈ పోస్టుల భర్తీ
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:52 AM
గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి, సొంత అవసరాలకు వాడుకుని, ప్రజలపై రూ.30వేల కోట్ల ఆర్థిక భారం మోపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలపై రూ.30వేల కోట్ల భారం: గొట్టిపాటి
బుచ్చిరెడ్డిపాళెం/ఇందుకూరుపేట, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి, సొంత అవసరాలకు వాడుకుని, ప్రజలపై రూ.30వేల కోట్ల ఆర్థిక భారం మోపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. మంగళవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడు, ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలలో విద్యుత్ సబ్‌స్టేషన్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలపై భారం మోపి వదిలేస్తే కూటమి ప్రభుత్వం రూపాయి కూడా పెంచకుండా, మళ్లీ ఎన్నికల్లోపు విద్యుత్ చార్జీలను 1.19 రూపాయలు తగ్గించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో భారీగా ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. పంచేడు సబ్‌స్టేషన్‌కు రూ.40 లక్షల విలువచేసే భూమిని ఉచితంగా ఇచ్చిన దాత అమర్నాధరెడ్డిని మంత్రి రవికుమార్ సత్కరించారు.