కోతలతో కష్టాలు
ABN , Publish Date - May 26 , 2026 | 03:59 AM
వేసవి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు అనధికార విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. ఓవర్‌లోడుకుతోడు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడమే దీనికి కారణం.
ఓవర్‌లోడ్, అత్యధిక ఉష్ణోగ్రతలతో.. టపాసుల్లా పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
2 రోజుల్లోనే పేలిన 22 ట్రాన్స్‌ఫార్మర్లు
ఈదురు గాలులతో 30కిపైగా ప్రాంతాల్లో తెగిపోయిన 33, 132 కేవీ లైన్లు
సిబ్బంది కొరతతో మరమ్మతుల్లో ఆలస్యం
ఫలితంగా ఎడాపెడా అనధికార కోతలు
ఉక్కపోతకు కోతలు తోడై నరకం
అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): వేసవి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు అనధికార విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. ఓవర్‌లోడుకుతోడు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడమే దీనికి కారణం. అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల విపరీతమైన ఈదురుగాలులతో లైన్లు తెగిపోతున్నాయి. దీంతో కరెంటు రాక..పోకల తీరు సందిగ్ధంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో వివిధ సబ్‌స్టేషన్లలో సుమారు 22 ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయని, సుమారు 30కిపైగా ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు, 132 కేవీ లైన్లు తెగిపోయాయని విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్తు సరఫరా పరంగా ఇబ్బందులు లేకున్నా, నిర్వహణ లోపాలను సరిదిద్దలేకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం సత్తెనపల్లిలో 132 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్‌లోడు కారణంగా పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో అది మరోసారి పేలిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఆదివారం విజయవాడలోని మహానాడు ప్రాంతంలో 33 కేవీ లైన్ తెగిపోయింది. వాస్తవానికి ఆ ప్రాంతానికి మాత్రమే విద్యుత్తు సరఫరా నిలిచిపోవాల్సి ఉండగా, విజయవాడ నగరంలో మూడోవంతు సుమారు రెండు గంటలకుపైగా అంధకారంలోనే ఉండిపోయింది.
దీనికి కారణం.. గుణదల 220 కేవీ నుంచి నగరంలోను.. శివారు ప్రాంతాల్లోను ఉన్న వివిధ 33 కేవీ సబ్‌స్టేషన్లకు 15 ఫీడర్లు (లైన్లు) అదే మార్గంలో వెళుతుండటమే. ఒక్క లైనును సరిచేయడానికి సుమారు 8 ఫీడర్లను అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. 220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఇతర సబ్ స్టేషన్లకు వెళ్లే ఫీడర్లన్నింటినీ కలిపి ఒకే పోల్ మీదుగా తీసుకెళుతుండటంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరిచేసేందుకు మిగిలిన సబ్‌స్టేషన్లకు కూడా విద్యుత్తు సరఫరా నిలిపివేయాల్సి వస్తోంది. బలమైన ఈదురుగాలులు కారణంగా విద్యుత్తు స్తంభాలు నేలకొరగడం, 132 కేవీ లైన్లు తెగిపడుతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కొరత కూడా విద్యుత్తుశాఖను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో చాలాచోట్ల 3-4 గంటలపాటు అనధికార కోతలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 625 విద్యుత్తు ఏఈ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 వరకు సబ్‌స్టేషన్లను నిర్మించింది. అయినా.. మరో 600 వరకు సబ్‌స్టేషన్ల అవసరం ఉంది. లేకుంటే ఉన్న వాటిపై ఓవర్‌లోడుతో విద్యుత్తు అంతరాయాలు తప్పవు. ప్రస్తుతం ఆర్‌డీఎ్‌సఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, కొత్త లైన్ల నిర్మాణం జరుగుతోంది.