మూడేళ్లలో మూడు పోర్టులు రెడీ
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:54 AM
మూడేళ్లలో రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం 2028 నాటికి అందుబాటులోకి..
ఎన్నికల్లోగా వాణిజ్య కార్యకలాపాలు
త్వరలో నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మూడేళ్లలో రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2029 ఎన్నికల్లోగా వీటిలో వర్తక, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మూలపేట పోర్టుకు సంబంధించి కోర్టు కేసులు సత్వరమే పరిష్కరించుకుంటే ప్రధాన అవరోధం తొలగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
మూలపేట పోర్టు
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణాన్ని రూ.3,526.18 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 70.96 శాతం మేర ఖర్చు చేశారు. నిర్మాణ పనులు 75.37 శాతం పూర్తయ్యాయి. బ్రేక్‌వాటర్ పనులు ఇప్పటికే 93 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. డ్రెడ్జింగ్, రిక్లమేషన్ పనులు ఇప్పటికే 92 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. బెర్తుల పనులు కూడా 80 శాతం పూర్తయ్యాయి. ఈ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మౌలిక సదుపాయాల కల్పన శాఖ అధికారులు తెలిపారు. ఈ పోర్టు నిర్మాణంపై ఉప్పుకయ్యల రైతులు పరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును పరిష్కరించుకుంటే ప్రధాన అడ్డంకి తొలగిపోతుంది. ఈ పోర్టుకు సంబంధించి 516 మంది నిర్వాసిత కుటుంబ సభ్యులకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చెబుతోంది.
రామాయపట్నం పోర్టు
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను రూ.3,289.96 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇప్పటివరకూ 61.46 శాతం మేర వ్యయం చేశారు. నిర్మాణ పనులు 78.28 శాతం పూర్తయ్యాయి. బ్రేక్‌వాటర్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఇవి ఈ ఏడాది జూలై నెలాఖరుకు పూర్తవుతాయి. డ్రెడ్జింగ్, రిక్లమేషన్ పనులు 67 శాతం పూర్తయ్యాయి. ఇవి ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతాయి. బెర్తు నిర్మాణ పనులు 89.30 శాతం పూర్తయ్యాయి. ఈ పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మెకనైజేషన్ పనులు 2028 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. నిర్వాసితులైన కర్లపాలెంలోని 371 కుటుంబాలకు ఈ ఏడాది జూన్‌లో, శాలిపేటలోని 84 కుటుంబాలకు జూలై నాటికి సహాయ పునరావాస ప్యాకేజీని అందిస్తామని అధికారులు వెల్లడించారు.
మచిలీపట్నం పోర్టు
మచిలీపట్నం పోర్టు పనులను రూ.4,736.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది రూ.5,155.80 కోట్లకు చేరింది. ఇప్పటి దాకా 51 శాతం మేర రూ.2621.86 కోట్లు వ్యయం చేశారు. బ్రేక్‌వాటర్ పనులు 90.23 శాతం పూర్తయ్యాయి. డ్రెడ్జింగ్, రెక్లమేషన్ పనులు వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తారు. బెర్తుల నిర్మాణాలు 70 శాతం పూర్తయ్యాయి. మెకనైజేషన్ పనులు 2028 ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయి.
ఈ ఏడాది 4 ఫిషింగ్ హార్బర్లు పూర్తి
రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను తొలిదశలో రూ.1439.29 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబరులో జువ్వలదిన్నె, ఈ ఏడాది డిసెంబరులో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.