పాలీసెట్‌లో 91.37శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - May 06 , 2026 | 05:45 AM
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్-2026లో 91.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
16 మందికి 120కి 120 మార్కులు.. గోదావరి జిల్లాలకే ఎక్కువ ర్యాంకులు
ఈ ఏడాది భారీగా పెరిగిన అభ్యర్థులు.. గతేడాది కంటే తగ్గిన ఉత్తీర్ణత శాతం
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్-2026లో 91.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను మంగళవారం ఉదయం 10.30 గంటలకు మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్ 25న నిర్వహించిన పరీక్షకు ఈసారి రికార్డు స్థాయిలో 1,77,581 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,63,008 మంది పరీక్షకు హాజరవగా 1,48,950 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 93.57 శాతం మంది, బాలురు 89.88 శాతం మంది అర్హత సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 99.11 శాతం మంది, పోలవరం జిల్లాలో 95.46 శాతం మంది, ప్రకాశం జిల్లాలో 94.72 శాతం మంది అర్హత సాధించారు. శ్రీసత్యసాయి జిల్లా 87.85 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. పాలీసెట్‌ను 120 మార్కులకు నిర్వహించగా మొత్తం 16 మంది విద్యార్థులు 120 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వీరిలో తమరాల సాయివిష్ణుతేజ, తోట మానస, పిండి జేవీ నరసింహస్వామి, ముల్లు రోహిత్, కొప్పర్తి ఎస్‌ఎ్‌సవీ కృష్ణచైతన్య, తోలేటి బి.దియా, రెడ్డి వరుణ్‌కుమార్, భీమిరెడ్డి వీవీ యశ్వంత్, సంగినీడి జైరామ్ (పశ్చిమగోదావరి), జామి చేతన్, శీలం హిమచంద్ర, గొర్లె బాలాదిత్య (విశాఖపట్నం), దామోదరం గౌతమ్, దిరిశాల ఎన్‌ఎస్ హిమసూర్య (తూర్పుగోదావరి), పూడి చైతన్య (కాకినాడ), వెల్దుర్తి మోక్షిత్ (తిరుపతి) ఉన్నారు.
భారీగా పెరిగిన అభ్యర్థులు
ఈ ఏడాది డిప్లొమా కోర్సులకు పోటీ భారీగా పెరిగింది. గతేడాది 1,39,840 మంది పాలీసెట్ రాయగా ఈసారి 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు. గతేడాది 1,33,358 మంది అర్హత సాధించగా, ఈ ఏడాది 1,48,950 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే గతేడాది ఉత్తీర్ణత శాతం 95.36 శాతం నమోదవగా ఈసారి అది 91.37 శాతానికి తగ్గింది. గతేడాది రాష్ట్రంలో 82,870 సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 84,130కు పెరిగింది. సీట్ల సంఖ్యకు రెట్టింపు మంది ప్రవేశ పరీక్ష రాస్తున్నా డిప్లొమా కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. దీంతో ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులు భారీగా పెరగడంతో మొత్తం సీట్లు భర్తీ కావొచ్చని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గిరిజన జిల్లాల్లో ఉత్తమ ఫలితాలు: లోకేశ్
పాలీసెట్‌లో గిరిజన జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయని తెలిపారు. అర్హత సాధించిన వారిలో బాలికలు ఎక్కువమంది ఉండటం మహిళా సాధికారత సాధించే దిశగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.