నిబంధనలు గాలికొదిలి.. అనుమతులిచ్చేద్దాం!
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:11 AM
ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వేస్ట్‌కు సంబంధించి ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు అనుమతుల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అత్యుత్సాహం చూపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతిచ్చిన..
బయో వేస్ట్ ప్లాంట్లకు అడ్డదారుల్లో అనుమతులు?
కాలుష్య నియంత్రణ మండలి అత్యుత్సాహం
వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ప్లాంట్లకు మద్దతు
ఎన్జీటీ, సెంట్రల్ పీసీబీ నిబంధనలకు తూట్లు
టెండర్ లేకుండానే నిర్వహణకు అనుమతిచ్చే ప్లాన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వేస్ట్‌కు సంబంధించి ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు అనుమతుల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అత్యుత్సాహం చూపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతిచ్చిన బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణకు అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్ - సీఎఫ్‌వో) ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్లాంట్ల ఏర్పాటే నిబంధనలకు విరుద్ధమని అప్పీలేట్ అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఆదేశాలున్నాయి. అలాంటి ప్లాంట్లకు నిర్వహణ అనుమతులివ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. పీసీబీ అధికారులు మాత్రం ముందుకెళ్తున్నారు. జిల్లాల్లో బయోవేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు ఎన్జీటీ, సీపీసీబీ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాయి. వాటికి అనుగుణంగా ఉంటేనే కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులివ్వాలి. కానీ... గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కనీసం నిబంధనలు పాటించకుండా విజయనగరం, తూర్పుగోదావరి, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడపలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఈ ఏడు చోట్లలో విజయనగరం, తూర్పుగోదావరిలో మాత్రమే ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. తాజాగా ఆ రెండు ప్లాంట్లకు నిర్వహణ అనుమతి (సీఎఫ్‌వో) ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక ప్రాంతంలో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే గ్యాప్ అనాలసిస్ స్టడీ కచ్చితంగా చేయాలి. ఈ నివేదికను సీపీసీబీకి సమర్పించి, దాని నుంచి అనుమతి వచ్చాక ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించాలి.
ఈ టెండర్లు పిలిచేందుకు కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తీసుకోవాలి. టెండర్లలో ఎల్1గా వచ్చిన కంపెనీకి తొలుత కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు అనుమతిస్తారు. ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక మరోసారి పీసీబీ దాన్ని సందర్శించి, సీపీసీబీ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారా లేదా అని పరిశీలిస్తుంది. అనంతరం సీపీసీబీకి నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాతే సీపీబీసీ సీఎఫ్‌వోకు అనుమతిస్తుంది. ఈ నిబంధనలు పాటించకుండానే, గ్యాప్ అనాలసిస్ స్టడీ చేయకుండానే, సీపీసీబీ ఆమోదం లేకుండా విజయనగరం, విశాఖ, తూర్పూగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఒత్తిడితో అనుమతులిచ్చారు. దానిపై విచారణ చేయాల్సిన పీసీబీ అధికారులు... ఇప్పుడు విజయనగరం, తూర్పుగోదావరిలో ఏర్పాటైన ప్లాంట్ల నిర్వహణకు అనుమతివ్వాలని భావిస్తున్నారు. సీపీసీబీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన సంస్థల్లో పీసీబీ అధికారులే వాటాలు తీసుకుని, నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై సీఎంవోకు కూడా అనేక ఫిర్యాదులు అందాయి.
కొత్త మెథడాలజీతో మతలబు
2016, 2025లో సీపీసీబీ కొత్త మెథడాలజీని ప్రవేశపెట్టింది. ఆస్పత్రుల్లో ప్రతి బెడ్ నుంచి 277 గ్రాముల బయో వేస్ట్‌ను ఆధారంగా చేసుకుని కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులివ్వాలని సూచించింది. ఒక ప్రాంతంలోని ఆస్పత్రుల్లో ఉన్న పడకలు, వాటి నుంచి వచ్చే వ్యర్థాల ఆధారంగా కొత్త వాటికి అనుమతులివ్వాలని చెప్పింది. ఇప్పటికే ఉన్న ప్లాంట్ల సామర్థ్యం కంటే ఎక్కువ వేస్ట్ వస్తేనే కొత్త ప్లాంట్లకు అనుమతివ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకున్న పీసీబీ అధికారులు కొత్త వాటికి అనుమతులిచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో 10 వేల బెడ్స్ ఉంటే ఒక్కో బెడ్ నుంచి 277 గ్రాముల వేస్ట్ వస్తుందని లెక్క కడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ప్లాంట్ కెపాసిటీకి మించిన వేస్ట్ వస్తుందని తప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కలపై అప్పీలేట్ అథారిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సీపీసీబీ నిబంధనల ప్రకారం మరోసారి నివేదిక సమర్పించాలని, అప్పటి వరకూ కొత్త ప్లాంట్ల నిర్వహణకు అనుమతిచ్చేది లేదని గత వారం జరిగిన బోర్డు మీటింగ్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పీసీబీ అధికారులు మరోసారి నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు.
ఇప్పటికే రాష్ట్రంలో 13 ప్లాంట్లు...
రాష్ట్రంలో ఇప్పటికే 13 బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆస్పత్రుల్లో ప్రతి పది వేల పడకలకు ఒక బయోవేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఒక్కో ప్లాంట్‌కు దాదాపు 30 వేల పడకలకు సంబంధించిన బయో వేస్ట్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. కానీ.. 10 వేల పడకలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఆయా కంపెనీలు అక్కడికే పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులు అవకాశం లేకపోయినా మరో 2 ప్లాంట్లకు అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే పీసీబీ అధికారులు 2022లో ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో ఉన్న బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల సామర్థ్యంలో 37 శాతమే శుద్ధి చేస్తున్నాయని, ఇంకా 63 శాతం వ్యర్థాల ట్రీట్‌మెంట్‌కు అవకాశం ఉందని నివేదించాయి. తామిచ్చిన ఆ నివేదికను కూడా పీసీబీ అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు.