ఏఐతో నేరాలకు చెక్
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:05 AM
మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయడం.. నేరం జరగక ముందే ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం వంటి అంశాలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు.
‘ప్రిడిక్టివ్ పోలీసింగ్’పై ఏపీ పోలీసుల బ్లూ ప్రింట్
మహిళలు, చిన్నారుల భద్రతకు 20 ఏళ్ల రోడ్‌మ్యాప్
నేరం జరిగాక కాదు.. జరగక ముందే అడ్డుకునే లక్ష్యం
డ్రోన్లు, ఏఐ, డీప్‌ఫేక్ గుర్తింపు వ్యవస్థలు, ప్రత్యేక చట్టాలు
2047 నాటికి లక్ష్యాలు నిర్దేశించుకున్న ఏపీ పోలీసు శాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయడం.. నేరం జరగక ముందే ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం వంటి అంశాలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. దీనికోసం 2047 లక్ష్యంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్ విజన్-2047’లో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేకంగా 20 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్లు, డేటా విశ్లేషణ, డిజిటల్ నిఘా సాయంతో ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే ‘ప్రిడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్’ను అమలు చేయాలని ఈ రోడ్‌మ్యా్‌పను ప్రతిపాదించారు. రానున్న రెండు దశాబ్దాల్లో సైబర్ స్టాకింగ్, డీప్‌ఫేక్‌ల ద్వారా వేధింపులు, అనుమతి లేకుండా వ్యక్తిగత చిత్రాల ప్రచారం, ఆన్‌లైన్ గ్రూమింగ్, పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన డిజిటల్ కంటెంట్, స్పైవేర్ వంటి సవాళ్లు పెరుగుతాయని అంచనా వేసింది. వాటిని ఎదుర్కొనేందుకు సాంకేతికత ఆధారిత పోలీసింగ్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేసింది. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, స్పెయిన్‌తోపాటు గుజరాత్, కేరళంలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, ఏపీకి సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత సాంకేతిక వ్యవస్థలో డీప్‌ఫేక్‌లను గుర్తించే ప్రత్యేక ఇంజన్, పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించే డేటాబేస్, ఆన్‌లైన్ గ్రూమింగ్‌ను విశ్లేషించే ఏఐ వ్యవస్థ, డార్క్‌వెబ్ పర్యవేక్షణ, క్రిప్టో కరెన్సీ లావాదేవీల ట్రాకింగ్, సైబర్ కైరమ్ వార్‌రూమ్ ఏర్పాటువంటి అంశాలు ఉన్నాయి. సిబ్బందికి అన్ని స్థాయిల్లో సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాల సేకరణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు.
నాలుగు కీలక వ్యవస్థలు..
రోడ్ మ్యాప్‌లో 4 ప్రధాన సాంకేతిక వ్యవస్థలను ప్రతిపాదించారు. మొదటిది ‘దృష్టి’. ఇది సీసీటీవీలు, డ్రోన్లు, డయల్-112 ఓపెన్ సోర్స్ సమాచారం తదితరాల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకే వేదికపై విశ్లేషించి, నేరం జరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించే వ్యవస్థ. రెండోది ‘గార్డియన్ గ్రిడ్’. మైక్రో డ్రోన్లు, ఏఐ ఆధారిత పెట్రోలింగ్ వాహనాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్), ఆర్‌ఎ్‌ఫఐడీ నెట్‌వర్క్‌లను అనుసంధానించి అనుమానితుల కదలికలను గుర్తించేందుకు దీనిని ప్రతిపాదించారు. మూడోది ‘శక్తి 2.0’. ప్రస్తుతం ఉన్న శక్తి యాప్‌ను మరింత విస్తరించి, వేరబుల్ పరికరాల ద్వారా సైలెంట్ ఎస్‌ఓఎస్, ప్రమాద సంకేతాలను గుర్తించే స్మార్ట్ వీధి దీపాలు, బస్ స్టాప్‌లు, పోలీసు పర్యవేక్షణలో పనిచేసే వలంటీర్ నెట్‌వర్క్, బాధితులకు కౌన్సెలింగ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. నాలుగోది న్యాయ, చట్టపరమైన సంస్కరణలు. రోడ్‌మ్యా్‌పను 3 దశలుగా విభజించారు. తొలి ఐదేళ్లలో ప్రతి మహిళా పోలీస్ స్టేషన్‌లో సైబర్ ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటు, సురక్ష శక్తి వార్‌రూమ్ స్థాపన, 3 నగరాల్లో శక్తి 2.0 పైలట్ ప్రాజెక్టు, మహిళా, సైబర్ నిపుణుల నియామకం, డిజిటల్ వేధింపులు, డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ గ్రూమింగ్‌పై కఠిన చట్టాల ప్రతిపాదనలు చేపట్టాలని సూచించారు. 6-12 ఏళ్ల మధ్య డిజిటల్ ట్విన్, గార్డియన్ గ్రిడ్ విస్తరణ, ప్రత్యేక సైబర్ ఫోరెన్సిక్ విభాగాలు, సైబర్ లైంగిక నేరగాళ్ల డేటాబేస్, ప్రతి జిల్లాలో బాధితుల రక్షణ, పునరావాస కేంద్రాలు అమలు చేయాలి. 13-20ఏళ్ల మధ్య ఏఐ ఆధారిత పోలీసింగ్ పూర్తిస్థాయిలో అమలు, డిజిటల్ గార్డియన్‌షి్‌ప చట్టాన్ని తేవడం, శక్తి నోడ్స్ విస్తరణ. మహిళలు, చిన్నారులపై నివారించగలిగే నేరాలను 2047 నాటికి దాదాపు అరికట్టడం, రాష్ట్రంలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో 3 నిమిషాల్లోపే స్పందించడం, గుర్తించిన ప్రమాదకర కేసుల్లో 90 శాతం ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే నివారించడం, దేశంలో అత్యంత విశ్వసనీయ పోలీసు వ్యవస్థగా ఏపీ పోలీసులను తీర్చిదిద్దడం.. ఈ విజన్-2047 ప్రధాన లక్ష్యాలుగా నివేదికలో పేర్కొన్నారు.