Share News

పదవీ విరమణనాటికైనా ‘స్టార్‌’ దక్కేనా?

ABN , Publish Date - May 10 , 2026 | 04:38 AM

దాదాపు 30 ఏళ్ల క్రితం పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరారు. త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. మొత్తం సర్వీసులో పొందిన పదోన్నతి ఒక్కటంటే ఒక్కటే!. కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా...

పదవీ విరమణనాటికైనా ‘స్టార్‌’ దక్కేనా?

ముప్పై ఏళ్ల సర్వీసులో మూడు పట్టీలే దిక్కా?

ప్రమోషన్ల కోసం హెచ్‌సీల ఎదురు చూపులు

రాష్ట్రంలో వందల సంఖ్యలో ఏఎస్ఐల ఖాళీలు

సివిల్‌, ఏఆర్‌ పోలీసుల మధ్య సర్వీసు వార్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దాదాపు 30 ఏళ్ల క్రితం పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరారు. త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. మొత్తం సర్వీసులో పొందిన పదోన్నతి ఒక్కటంటే ఒక్కటే!. కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా మూడు పట్టీలు భుజానికి తగిలించుకోవడం!!. అయితే, తాము పదవీ విరమణ చేసేలోపైనా సింగిల్‌ స్టార్‌(ఏఎస్ఐ) భుజంపైకి వస్తుందని వారంతా ఆశ పడుతున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నా ఏఎస్ఐ అయ్యే అవకాశం కనిపించడం లేదు. పోలీసు శాఖలో ఖాళీలు లేవా అంటే వందల సంఖ్యలో ఏఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అయినా, పదోన్నతులు ఎందుకు లభించడం లేదు. దీనికి కారణం ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం తీరేనని చెబుతున్నారు. సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌) పోలీసులకు మధ్య ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం అధికారులు సర్వీస్‌ రూల్స్‌ వివాదాన్ని రాజేసి చోద్యం చూస్తున్నారని పలు జిల్లాల హెడ్‌ కానిస్టేబుళ్లు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించి పదవీ విరమణ లోపైనా తమకు పదోన్నతి కల్పించాలని విన్నవిస్తున్నారు.


ప్రాతిపదికల మార్పు

రాష్ట్ర పోలీసు శాఖలో 1991-94 మధ్యలో కానిస్టేబుళ్లుగా చేరిన సిబ్బందికి ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-1996 ప్రకారం ఖాళీలను పరిగణనలోకి తీసుకుని 2016-17 మధ్య హెడ్‌ కానిస్టేబుళ్లు(హెచ్‌సీ)గా పదోన్నతి లభించింది. తర్వాత ప్రమోషన్‌ ఏఎ్‌సఐగా 2024-25 మధ్యలో రావాల్సి ఉంది. అమల్లో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం పదోన్నతులు కల్పించాల్సిన పోలీసు శాఖ జిల్లాకొక విధంగా వ్యవహరించింది. దీంతో పదోన్నతుల ప్రక్రియకు మెలిక పడింది. పోలీసు ప్రధాన కార్యాలయం 2013లో ప్రీ ప్రమోషనల్‌ ట్రైనింగ్‌కు పంపే ప్యానల్‌.. సెప్టెంబరు 1ని ప్రాతిపదికగా నిర్ణయిస్తూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సర్కులర్‌ జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే, దీని వెనుక ఏపీఎస్‌పీ, ఏఆర్‌ నుంచి వచ్చిన వారి ప్రయోజనాల కోసమేనని సివిల్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాము నేరుగా సివిల్‌లో ఎంపికయ్యామని, ఏఆర్‌ పోలీసులు సివిల్‌లోకి కన్వర్షన్‌ అయినప్పటి నుంచి సర్వీస్‌ పరిగణనలోకి తీసుకుంటే అభ్యంతరం లేదని చెబుతున్నారు. దీనికి ఆర్మ్‌డ్‌ పోలీసులు ససేమిరా అంటున్నారు. తాము పోలీసు శాఖలో సీనియర్లమని, ఏ విభాగంలో పని చేసినా తమ సర్వీసును గుర్తించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏఆర్‌ ఎస్‌ఐల విషయంలో కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ అదే విధానాన్ని పాటించాలని కోరుతున్నారు.


ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా..

పోలీసు శాఖలో సివిల్‌, ఏఆర్‌ విభాగాలు ఉన్నాయి. సివిల్‌ విభాగంలోకి కన్వర్షన్‌ కోసం ఏఆర్‌ పోలీసులు దరఖాస్తు చేసుకుంటే కొన్నేళ్ల తర్వాత అనుమతి లభిస్తుంది. అలా కన్వర్షన్‌ అయిన ఏఆర్‌ పోలీసులకు ఎప్పుడైతే సివిల్‌లోకి వస్తారో అప్పటి నుంచి సర్వీసు పరిగణనలోకి తీసుకోవాలని సివిల్‌ పోలీసులు చెబుతున్నారు. అదే ప్రామాణికంగా తీసుకోవాల్సిన ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం పదోన్నతుల ప్యానల్‌ సెప్టెంబర్‌ 1 నుంచి మొదలు పెట్టాలని కొన్ని జిల్లాలకు, జనవరి 1 నుంచి పరిగణనలోకి తీసుకోవాలని మరికొన్ని జిల్లాలకు లేఖలు రాసింది. రెండు వేర్వేరు తేదీలతో ఆయా జిల్లాల మినిస్టీరియల్‌ సిబ్బంది తమకు అందిన లేఖ ప్రకారం సర్వీస్‌ రిజిస్టర్లు పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపారు. కానీ, దీనిపై సివిల్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రంలో జిల్లాకొక నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు.

సివిల్‌, ఏఆర్‌ పోలీసుల పదోన్నతుల సర్వీస్‌ రూల్స్‌ న్యాయస్థానమే పరిష్కరిస్తుందని కొందరు హైకోర్టులో రిట్‌ వేశారు. అయితే, ఎస్టాబ్లిష్‌మెంట్ అధికారులు, జిల్లాల్లోని మినిస్టీరియల్‌ సిబ్బంది ఎలాంటి కౌంటర్‌ వేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారని హెడ్‌ కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. తప్పు సరిదిద్ది తమకు ఉన్నతాధికారులు న్యాయం చేస్తే రిట్‌ పిటిషన్లు వెనక్కి తీసుకుంటామని, లేదంటే తొందరగా కౌంటర్‌ దాఖలు చేస్తే కోర్టు తీర్పునకు అనుగుణంగా అర్హులైన వారికి పదోన్నతులు లభిస్తాయని చెబుతున్నారు.


పాతికేళ్లుగా కానిస్టేబుళ్లుగానే!

పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా 1998, 2000లో చేరిన వారికి పాతికేళ్లయినా ఒక్క ప్రమోషన్‌ కూడా రాలేదు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ 50నుంచి 80 దాకా హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులున్నా సివిల్‌, ఏఆర్‌ సర్వీసు వివాదంతో పదోన్నతులు ఆగిపోయాయి. ఏపీఎస్‌పీలో ఉద్యోగం పొందిన కానిస్టేబుళ్లు ఐదేళ్ల తర్వాత సివిల్‌ నోటిఫికేషన్‌ పడటంతో సివిల్‌లో ఉద్యోగం పొందారు. సివిల్‌లో ఎప్పుడు ఉద్యోగం వచ్చిందో అప్పటి నుంచే సీనియారిటీ పరిగణలోకి తీసుకోవాలని ఆ బ్యాచ్‌ సివిల్‌ పోలీసులు వాదిస్తుండగా అంతకు ముందు ఏపీఎస్‌పీలో తమ సర్వీసును లెక్కించాల్సిందేనని ఏపీఎస్‌పీల నుంచి సివిల్‌లో ఉద్యోగం పొందిన కానిస్టేబుళ్లు వాదిస్తున్నారు. ఈ వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లు కోర్టును ఆశ్రయించడంతో సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో సమస్య పరిష్కారం అయ్యేందుకు సమయం పడుతుండటంతో 2 ఇంక్రిమెంట్లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 10 , 2026 | 04:43 AM