పెళ్లి మండపంలో జంట హత్యలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:48 AM
పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..
కత్తులతో దాడి చేసి ఇద్దరిని పొట్టనబెట్టుకున్న దుండగులు
తిరుపతి క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి): పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో ఉన్న పద్మావతి కల్యాణ మండపంలో చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం... ఏర్పేడు మండలం గొల్లపల్లెకు చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన వివాహం బుధవారం రాత్రి పద్మావతి కల్యాణ మండపంలో జరిగింది. ఈ వేడుకకు గొల్లపల్లెకు చెందిన మునిరత్నం యాదవ్(41), తిరుపతి సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన ఆయన స్నేహితుడు మణికంఠ(35) హాజరయ్యారు. మునిరత్నం ప్రస్తుతం తిరుపతి జీవకోనలో ఉంటూ తిరుమలలో చిరు వ్యాపారం నిర్వహిస్తుండగా, మణికంఠ జీప్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కల్యాణ మండపం ఆవరణలో ఉన్న మునిరత్నం, మణికంఠపై కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా కత్తులతో దాడికి దిగారు. కత్తిపోట్లతో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మణికంఠను స్థానికులు 108 అంబులెన్స్‌లో హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదుగురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు ద్విచక్ర వాహనాలపై నిందితులు కళ్యాణ మండపానికి చేరుకున్నట్లు గుర్తించారు. దాడి అనంతరం అందరూ అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణంగా తెలుస్తోంది.