Share News

పోలీసుల ‘భద్రత’కు భరోసా

ABN , Publish Date - May 19 , 2026 | 06:04 AM

రాష్ట్ర పోలీసులకు ‘భద్రత’తో కూడిన భరోసా దక్కనుంది. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో పోలీసులకు పర్సనల్‌ లోన్ల పరిమితిని 50 శాతం పెంచుతూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు.

పోలీసుల ‘భద్రత’కు భరోసా

  • పర్సనల్‌ లోన్‌ 50శాతం పెంపు.. వడ్డీ తగ్గింపు

  • పోలీసు భద్రత పథకాన్ని సంస్కరించిన డీజీపీ గుప్తా

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసులకు ‘భద్రత’తో కూడిన భరోసా దక్కనుంది. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో పోలీసులకు పర్సనల్‌ లోన్ల పరిమితిని 50 శాతం పెంచుతూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.5లక్షల వరకూ పర్సనల్‌ లోన్‌ ఇస్తుండగా.. సర్వీసులో ఉన్న పోలీసులకు ఎలాంటి జామీను అవసరం లేకుండా రూ.7.5 లక్షలకు పెంచారు. ఎస్పీ విచారణ కూడా అవసరం లేదని, వడ్డీ రేటు కూడా 9శాతానికి తగ్గించడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పోలీసుల పొదుపు నిధులతో నడుస్తున్న భద్రత పథకం ద్వారా సిబ్బంది అవసరాల నిమిత్తం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తారు. ఈ పథకం అమలుపై సమీక్షించిన డీజీపీ... దీన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంస్కరించారు. కాగా, నిధుల కొరత కారణంగా కొన్నాళ్లపాటు వాయిదా వేసిన గృహ రుణాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు.

చెన్నై అపోలో.. వేలూరు సీఎంసీలో ఆరోగ్య సేవలు

పోలీసులను ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇటువంటి వారికి చెన్నై అపోలో, వేలూరు సీఎంసీతోపాటు ఇతర కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏపీ పోలీసు శాఖ త్వరలో ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఆరోగ్య భద్రత క్లెయిమ్‌లు వేగంగా పరిష్కరించేందుకు డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 06:05 AM