మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’
ABN , Publish Date - May 30 , 2026 | 04:42 AM
మహిళలు, బాలికలపై నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది
నేరస్థులకు సత్వర శిక్షలే లక్ష్యం: డీజీపీ హరీశ్ గుప్తా
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలపై నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మహిళా, శిశు భద్రత విభాగం ఐజీపీ బి.రాజకుమారి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యాచరణకు సంబంధించిన పోస్టరును శుక్రవారం డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆవిష్కరించారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు తదితర నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రతి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సంచలనాత్మక కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టనుందని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆపరేషన్ దండాయన కొనసాగుతుందన్నారు. కాగా, బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, మహిళా సంక్షేమ సంస్థల సహకారం తీసుకోనున్నారు. పునరావృతంగా మహిళలపై నేరాలకు పాల్పడే నేరస్థులపై జియో ట్యాగింగ్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. లైంగిక నేరస్థులపై సెక్సువల్ అఫెండర్స్ షీట్స్ తెరిచి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీ చెప్పారు.