అవన్నీ తప్పుడు ప్రచారాలే!
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:54 AM
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న తప్పుడు ప్రచారాలకు పోలీసు శాఖ చెక్ పెట్టింది. దీనిలో భాగంగా మూడు కేసులకు సంబంధించి ఆదివారం సమగ్ర వివరణ ఇచ్చింది.
కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి, దూషించారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవు
తుని చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మర గాలింపు
పెద్దాపురంలో మైనర్‌పై అత్యాచార ప్రచారం నిరాధారం
సమగ్ర వివరణ ఇచ్చిన పోలీసు శాఖ
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న తప్పుడు ప్రచారాలకు పోలీసు శాఖ చెక్ పెట్టింది. దీనిలో భాగంగా మూడు కేసులకు సంబంధించి ఆదివారం సమగ్ర వివరణ ఇచ్చింది. కావలిలో ఓ గిరిజన మహిళను టీడీపీ నాయకుడు వివస్త్రను చేశారన్న ఆరోపణలకు ఆధారాలు లభించలేదని పేర్కొంది. తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందని తెలిపింది. ఇక పెద్దాపురంలో మైనర్‌పై అత్యాచారం, బలవంతపు గర్భస్రావం జరిగిందన్న ప్రచారం కూడా వాస్తవ విరుద్థమని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా కావలిలో రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత వివాదమే ఘర్షణకు కారణమైందని పోలీసులు వెల్లడించారు. గిరిజన మహిళ పీట్ల సుకుమారి అలియాస్ షేక్ ఖైరున్నిసాను వివస్త్రను చేసి దూషించారన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అనంతరం నమోదైన ఫిర్యాదులో టీడీపీ నాయకుడు షేక్ ఇబ్రహీంను నిందితుడిగా చేర్చినా, ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై రెండు కేసులు నమోదు చేశామని, దర్యాప్తు తుది దశకు చేరిందని వెల్లడించారు. ఖైరున్నిసా ఎస్టీ కాదని, ఆమె వద్ద బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాన్ని గుర్తించినట్లు వివరించారు. ఇక కాకినాడ జిల్లా తుని మండలంలో గతనెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం 120 మందికి పైగా పోలీసు సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్లతో పాటు ఎనిమిది ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాలు, టవర్ డంప్, కాల్ డేటా రికార్డులు, ఫోరెన్సిక్ పరీక్షలు సహా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
పెద్దాపురంలో మైనర్‌పై అత్యాచారం, బలవంతపు గర్భస్రావం జరిగిందంటూ మీడియాలో వచ్చిన ప్రచారం నిరాధారమని స్పష్టం చేశారు. బాధితురాలు మేజర్ (19) అని విచారణలో తేలిందని, పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధం వల్లే గర్భం దాల్చినట్లు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు వెల్లడించారని తెలిపారు. పిండం సరిగ్గా ఎదగకపోవడంతో వైద్యుల సూచన ప్రకారం గర్భస్రావం చేయించుకున్నట్లు వివరించారని పేర్కొన్నారు. అత్యాచారం, బలవంతం, పోలీసుల నిర్లక్ష్యంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.