5 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లకు విద్యుత్ ఆదా
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:37 AM
దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నిర్మిస్తున్న ఇళ్లకు విద్యుత్తును ఆదా చేసే ఎల్‌ఈడీ లైట్లు....
ప్రతి ఇంటికీ ఎల్‌ఈడీ బల్బులు, బ్యాటన్లు, సీలింగ్ ఫ్యాన్లు
దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు కార్యక్రమం
లబ్ధిదారులకు కూటమి సర్కారు వరం
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నిర్మిస్తున్న ఇళ్లకు విద్యుత్తును ఆదా చేసే ఎల్‌ఈడీ లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వడం ద్వారా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈమేరకు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎ్‌సహెచ్‌సీఎల్), ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎ్‌సఎల్), ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎస్‌ఈఈడీసీఓ) ఓ త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ అంతర్జాతీయ సదస్సు వేదికగా గురువారం ఏపీఎ్‌సహెచ్‌సీఎల్ ఎండీ అరుణ్‌బాబు, ఈఈఎ్‌సఎల్ సీఈవో అఖిలేశ్ కుమార్ దీక్షిత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా.. తొలి దశలో 5 లక్షల మంది పీఎంఏవై ఇళ్ల లబ్ధిదారులకు 4ఎల్‌ఈడీ బల్బులు, 2ఎల్‌ఈడీ బ్యాటన్ లైట్లు, 2 బీఎల్‌డీసీ(బ్ర్‌షలెస్ డైరెక్ట్ కరెంట్) సీలింగ్ ఫ్యాన్లు ఇస్తారు. బీఎల్‌డీసీ ఫ్యాన్ల వినియోగం ద్వారా 80 శాతం వరకు విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఎల్‌ఈడీ లైట్లు కూడా విద్యుత్తును గణనీయంగా ఆదా చేస్తాయి. వీటి వినియోగం ద్వారా ప్రతి కుటుంబానికీ ఏడాదికి సుమారు రూ.3,341 ఆదా అవుతుందని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా గత ఏడాది నవంబరులో రాయచోటిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 18వేల మంది లబ్ధిదారులకు ఎల్‌ఈడీ లైట్లు అందించారు.