మూడు నెలల్లో ‘వార్డు’ల పెంపు ప్రక్రియ
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:52 AM
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
మురికివాడలను అభివృద్ధి చేసేందుకు సన్నద్ధం
టీడీఆర్ బాండ్ల అక్రమార్కులపై చర్యలు
14 వేల కోట్లతో ప్రతి ఇంటికీ కొళాయి
జూన్ నాటికి మరో 40 వేల టిడ్కో గృహాల పంపిణీ: నారాయణ
తిరుపతి/చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, అంతకుముందు చిత్తూరులోనూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఆయా మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన ఎన్ని వార్డులు ఉన్నాయనేది అధ్యయనం చేశాం. ఇదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెంచుకునేందుకు వీలుగా ఇప్పటికే కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాం. వార్డుల పునర్విభజన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తాం. ఆ తర్వాతనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం. రాష్ట్రంలోని అన్ని మురికివాడలను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విశాఖలో రెండు ప్రాంతాలు చూశాం. వాటిలో ఒక ప్రాంతం వాళ్లు ముందుకు వచ్చారు. తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీని అభివృద్ధి చేసేందుకు నాడు ప్రయత్నిస్తే కొందరు ప్రజలను తప్పుదారి పట్టించారు. ఇప్పటికైనా ముందుకు వస్తే వారికి మెరుగైన ఇళ్లు నిర్మించి అభివృద్ధి చేస్తాం. టీడీఆర్ బాండ్లకు సంబంధించి కొందరు తప్పు చేశారు. వారిపై త్వరలో చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో పుర, నగరపాలక సంఘాల పరిధిలోని ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీరు సరఫరా చేసేందుకు రూ.14 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. మురుగునీటి నిర్వహణలో భాగంగా 123 పుర, నగరపాలక సంస్థల్లో ఎస్‌టీపీలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రూ.39.21 కోట్లను మంజూరు చేశాం. జనాభా ప్రాతిపదికన మురుగునీటి కాలువలను నిర్మించేందుకు రూ.20 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశాం. మొదటగా అత్యధిక, మధ్యస్థ జనాభా కలిగిన ప్రాంతాల్లో కాలువ లు నిర్మించేందుకు రూ.9 వేల కోట్లను విడుదల చేశాం. జూన్ నాటికి మరో 40 వేల టిడ్కో గృహాలను పంపిణీ చేస్తాం. నగర, పురపాలక సంఘాలు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీ ట్యాక్స్ మున్సిపల్ ఖాతాల్లోనే ఉండేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేసింది’ అని మంత్రి నారాయణ వివరించారు.