Share News

బోధనాస్పత్రుల్లో వైద్యుల రిటైర్మెంట్‌ వయసు పెంపు?

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:17 AM

వైద్య కళాశాలల్లో అత్యంత కీలకమైన ప్రొఫెసర్ల పోస్టులు భారీగా ఖాళీలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలో వారి పదవీ విరమణ వయసును..

బోధనాస్పత్రుల్లో వైద్యుల రిటైర్మెంట్‌ వయసు పెంపు?

  • 65 లేదా 70 సంవత్సరాలకు పెంచే యోచన

  • ప్రతిపాదన సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు

  • 17 వైద్య కళాశాలల్లో 200, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో 106 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ ఉండటంపై ఆందోళన

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో అత్యంత కీలకమైన ప్రొఫెసర్ల పోస్టులు భారీగా ఖాళీలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలో వారి పదవీ విరమణ వయసును 65 లేదా 70 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బడ్జెట్‌, కేంద్ర సాయం వినియోగం తీరుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో ప్రొఫెసర్‌ పోస్టుకు జాతీయ వైద్య సంఘం (ఎన్‌ఎంసీ) 3 పీజీ సీట్లు కేటాయిస్తుందని చెప్పారు. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 70 ఏళ్లుగా ఉండటంతో లభ్యత పెరిగి ఎక్కువ పీజీ సీట్లు పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 800 ప్రొఫెసర్ల పోస్టులకు గాను 200, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో 159 ప్రొఫెసర్‌ పోస్టులకు గాను 106 ఖాళీలు ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడటంతో పాటు పీజీ సీట్లు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచే అంశంపై సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ ప్రమాణాల మేరకు అన్ని మౌలిక వసతులు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 75శాతం హాజరు ఉన్న వైద్య విద్యార్థులు మాత్రమే వార్షిక పరీక్షలకు అర్హులని, ఈ విషయంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు రాజీపడొద్దని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు నమోదుకు ప్రస్తుతం అమలవుతున్న వ్యవస్థపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసే వ్యవస్థను వెంటనే ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jul 10 , 2026 | 04:17 AM