పీఎన్‌జీపై కొత్త పాలసీ తెస్తాం
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:08 AM
రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కడా లేదనిరాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలోనూ....
నేడు క్యాబినెట్ భేటీలో చర్చిస్తాం : మంత్రి మనోహర్
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కడా లేదనిరాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలోనూ, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వదంతులతో అవసరం లేకపోయినా కొందరు ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేందుకు పైప్డ్ గ్యాస్‌పై కొత్త పాలసీ తీసుకొచ్చేలా గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరాకు అవకాశం ఉన్నచోట వినియోగానికి ఈ పాలసీ ఉంటుందన్నారు. పైప్డ్ గ్యాస్ విషయంలో కేంద్రం ఇచ్చే రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల మంది పైప్డ్ గ్యాస్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. పలు పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ కోసం పైపులు వేయాల్సి ఉందన్నారు. వచ్చే వారం నుంచి హాస్టళ్లకు వేసవి సెలవులు ఇచ్చాక రెస్టారెంట్లు, హోటళ్లకు సిలిండర్ల సరఫరా పెంచి వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. 26న ఎల్‌పీజీ ట్యాంకర్ ఒకటి విశాఖపట్నం పోర్టుకు రానున్నట్లు ఆయిల్ కంపెనీలు సమాచారం ఇచ్చాయని, ఆ ట్యాంకర్ రాగానే మన గ్యాస్ నిల్వలు మరింత పెరుగుతాయని తెలిపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు అమ్మకాలపై 800 కేసులు పెట్టామని, 3 వేల 540 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి చెప్పారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబరు 1967కి లేదా జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.