డేటా సెంటర్లకు లోటు లేకుండా విద్యుత్
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:39 AM
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లకు లోటులేకుండా విద్యుత్తు అందిస్తామని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు.
విశాఖ ప్రాంతంలో 16 డేటా సెంటర్ల నిర్మాణ పనులు
2036-37 నాటికి 15 గిగావాట్ల లోడ్‌కు అవకాశం
దాని కోసం దశలవారీగా ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పెంపు
విద్యుత్తు శాఖ అధికారుల సమీక్షలో విజయానంద్ వెల్లడి
అమరావతి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లకు లోటులేకుండా విద్యుత్తు అందిస్తామని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. దీనికోసం అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. బుధవారం విద్యుత్తు సౌధ నుంచి ఏపీ ట్రాన్స్‌కో, ఐటీ, ఏపీఐఐసీ అధికారులతో విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పారిశ్రామికవృద్ధికి ఓడరేవులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఎంత కీలకపాత్ర పోషించాయో భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు డేటా సెంటర్లు అంతే పాత్ర పోషించనున్నాయని అన్నారు. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మౌలిక వసతుల క్లస్టర్లలో ఒకటిగా విశాఖ అవతరిస్తోందని వివరించారు. ట్రాన్స్‌కో అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ ప్రాంతంలో 16 ప్రధాన డేటా సెంటర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా 9.1 గిగావాట్ల విద్యుత్తు లోడ్ ఏర్పడనుందని చెప్పారు. అనుబంధ మౌలిక వసతులు, అంతర్జాతీయ నిర్వహణ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే, 2036-37 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం విద్యుత్తు డిమాండ్ దాదాపు 15 గిగావాట్లకు చేరుకోనుందని తెలిపారు. ఈ అవసరాలను తీర్చేందుకు ఏపీ ట్రాన్స్‌కో దశలవారీగా అమలు చేసే సమగ్ర విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ వ్యూహాన్ని రూపొందించిందని అన్నారు. ఇందులో భాగంగా.. పెందుర్తి, అచ్యుతాపురం, పలాస, పద్మనాభం, మాకవారిపాలెం వంటి కీలక సబ్ స్టేషన్లను అనుసంధానించే 765 కేవీ, 400 కేవీ, 220 కేవీ ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెట్‌వర్క్ 2034 నాటికి 15 గిగావాట్లకుపైగా స్థిరమైన డేటా సెంటర్ లోడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇక్కడ ప్రతిపాదిత భారీ పెట్టుబడుల కోసం కొత్త 400/220 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు అధిక సామర్థ్యమున్న ప్రత్యేక విద్యుత్తు ప్రసార మౌలిక వసతులు, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు విజయానంద్ తెలిపారు. విద్యుత్తు డిమాండ్ ఏర్పడకముందే విద్యుత్తు ప్రసార సామర్థ్యాన్ని పెంచేందుకు ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్’ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. సమావేశంలో ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ దినేశ్ కుమార్, ఈడీబీ సీఈవో షాన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.