రాష్ట్రస్థాయి సిబ్బందిగా.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీఎస్ఎస్‌లు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:42 AM
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ఆరోగ్యశాఖలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో పనిచేస్తున్న..
మల్టీజోన్ క్యాడర్‌గా సివిల్, డెంటల్ అసిస్టెంట్లు
ప్రభుత్వానికి ప్రతిపాదన: సత్యకుమార్
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ఆరోగ్యశాఖలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆ పైస్థాయి వైద్యులను రాష్ట్రస్థాయి సిబ్బందిగా గుర్తించనున్నారు. అలాగే, డీఎస్‌హెచ్(డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్)లో పనిచేసే సివిల్ సర్జన్ స్పెషలిస్టుల(సీఎస్ఎస్)ను కూడా స్టేట్ కేడర్‌గా పరిగణించచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచి ప్రజల్లో సంతృప్తి స్థాయిని 85 శాతానికి పెంచాలని ఆయన సూచించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై ఆయన వర్చువల్‌గా సమీక్షించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025ను సమీక్షించిన ఆయన.. డీఎంఈలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్నీ రాష్ట్రస్థాయిలోనే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలానే, డీఎస్‌హెచ్, డీహెచ్‌లో పని చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను మల్టీజోనల్ క్యాడర్‌గా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. పరిపాలనా సిబ్బందిని అవసరాల మేరకు జిల్లా, జోనల్, మల్టీజోనల్ సిబ్బందిగా పరిగణిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆరు జోన్లు, 2 మల్టీజోన్లుగా విభజించిన నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది పునర్నియామకాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, దీనికిగాను ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
అందరినీ ఒకే విధంగా చూడలేం
గత రెండేళ్లుగా 12,800 ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు, శస్త్ర చికిత్సలు, డయాగ్నోస్టిక్ పరీక్షల ఆధారంగా పనితీరును మదింపు చేసినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. సేవల సంఖ్యలో ఉన్నతి కనిపించినా, పనిచేసిన వారు, చేయని వారిని ఒకే విధంగా చూసినట్టు అవుతోందని, దీనికి భిన్నంగా నూతన విధానాన్ని మంత్రి సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థలో పని చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని ప్రతి వైద్యుడు, నర్సు, టెక్నీషియన్ రోజుకి ఏ స్థాయిలో సేవలు అందించాలో మదింపు చేసి, దాని ఆధారంగా సేవల లక్ష్యాన్ని నిర్థారించాలని ఆదేశించారు. ఇదే విధంగా ప్రతి డాక్టర్, ఇతర సిబ్బందికి సంబంధించి కూడా పక్కా లెక్కలు తేల్చాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి గరిష్ఠ ప్రయోజనాలను ప్రజలకు అందించే దిశగా కృషి చేయాలని కోరారు.
పారిశుధ్యంపై జాగ్రత్త!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవల్లో కొంత మేరకు లోటు ఏర్పడిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సిబ్బంది హాజరు కాకపోవడంతోనే ఈ అంశంపై అసంతృప్తి పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనికి కారణమైన అంశాలను పరిష్కరించి పూర్తిస్థాయిలో పారిశుధ్య సిబ్బందిని విధుల్లో నియమించాలని, ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వైద్యుల సంఘం హర్షం..
ప్రభుత్వ వైద్యులను రాష్ట్రస్థాయి, మల్టీజోన్ క్యాడర్‌గా గుర్తించేందుకు మంత్రి సత్యకుమార్ చర్యలు చేపట్టడం పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ జయధీర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న వైద్యులను రాష్ట్రస్థాయి క్యాడర్‌గా గుర్తిస్తే మరింత ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. వైద్యుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని కొనియాడారు.