Share News

నిధి యాప్‌లో పెన్షనర్ల వార్షిక ధ్రువీకరణ పత్రాలు

ABN , Publish Date - May 06 , 2026 | 04:27 AM

ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపుల కోసం అభివృద్ధి చేసిన నిధి యాప్‌లో పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది.

నిధి యాప్‌లో పెన్షనర్ల వార్షిక ధ్రువీకరణ పత్రాలు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపుల కోసం అభివృద్ధి చేసిన నిధి యాప్‌లో పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈమేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగులు పెన్షన్‌ పొందడానికి ప్రతి ఏడాది ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, మీ సేవా కేంద్రాలు, కామన్‌ సర్వీసు సెంటర్లు, బయోమెట్రిక్‌ సౌకర్యం ఉన్న పెన్షనర్‌ సంఘాల ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాలు సమర్పించవచ్చు. ఇప్పుడు కొత్తగా నిధి యాప్‌ ద్వారా ఈ పత్రాలను సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. పెన్షనర్లు తమ మొబైల్‌లోకి నిధి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, లాగిన్‌ అవ్వాలి. హోమ్‌ పేజీలోని ఏవీసీ టైల్‌ను ఉపయోగించాలి. అందులో ఉన్న ఆ పెన్షనర్‌ వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేస్తూ ధ్రువీకరించాలి. ధ్రువీకరణ పూర్తయ్యాక ఫేషియల్‌ రికగ్నిషన్‌ ఉపయోగించి ఏవీసీ అథెంటికేషన్‌ బటన్‌ ఉపయోగించాలి.

Updated Date - May 06 , 2026 | 04:28 AM