కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:36 AM
రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలు చేయడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. అయితే...
6 లక్షల దరఖాస్తులు!
ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థనలు
దరఖాస్తులతో సచివాలయాలకు అర్హులు
ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో వాటిని స్వీకరించని అధికారులు
నిరాశలో లక్షల మంది లబ్ధిదారులు
గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు
ఎప్పటికి ఆమోదం పొందుతాయో తెలీని స్థితి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలు చేయడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. అయితే... సామాజిక పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్లనుంచి 60 ఏళ్లకు కుదిస్తామన్న ఎన్నికల హామీ ఎప్పటి నుంచి అమలవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న! 60 ఏళ్లు దాటి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న వారంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులను తీసుకోవడం ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో కొత్త ‘లబ్ధిదారులు’ ఎన్టీఆర్ భరోసా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో పెన్షన్లు కావాలంటూ దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలలూ లేకపోవడంతో వాటిని అధికారులు స్వీకరించడం లేదు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో పెన్షన్లు కావాలంటూ కుప్పలుతెప్పలుగా వినతిపత్రాలు వస్తున్నాయి. విధాన నిర్ణయం వెలువడకపోవడంతో వారూ చూస్తాం...చేస్తాం..అని చెబుతున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులకు దీనిపై తాకిడి ఎక్కువైంది. కొత్త పెన్షన్లు కోరుతున్న దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సదరం సర్టిఫికెట్లు సమర్పించినా, తమ దరఖాస్తులు స్వీకరించడం లేదని వాపోతున్నారు.
పెన్షన్‌తో భరోసా..
కూటమి ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ విషయంలో శ్రద్ధ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగులకు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేలకు పెన్షన్లు పెంచారు. ఠంచనుగా ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారు ఇంటి గుమ్మంలోకి వెళ్లి పింఛను డబ్బులు చేతికి అందిస్తున్నారు. అయితే, కొత్త దరఖాస్తులకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదముంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఓసీలకు 60 ఏళ్లకు పెన్షన్లు ఇస్తామన్న హామీతో పాటు ఎస్సీ, ఎస్టీలు, కొన్ని బీసీ కులాలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీతో పెన్షన్ దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశాలు రాకపోవడంతో వచ్చిన దరఖాస్తుదారులకు సమాధానాలు చెప్పలేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా అర్హుల నుంచి దరఖాస్తులు గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుతున్నాయి.
వయోపరిమితి తగ్గింపుతో..
లబ్ధిదారుల వయోపరిమితిని కూటమి ప్రభుత్వం తగ్గించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వేల సంఖ్యలో దరఖాస్తులు జిల్లా కేంద్రాలకు, గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుతున్నాయి. అయితే, దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్‌లో ఆప్షన్ పెట్టలేదు. చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ కొత్తవాటిని మంజూరు చేయలేదు. అయితే సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మాత్రం కొత్త పెన్షన్లు మంజూరుచేశారు. కుప్పం మున్సిపాలిటీ సహా నాలుగు మండలాల్లో తొలుత 3,600 పెన్షన్లు మంజూరవ్వగా, రెండో విడతలో 1,047 దివ్యాంగుల పెన్షన్లు అందాయి. మిగిలిన 27 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో సుమారు 9,100 మందికి పైగా వేచి చూస్తున్నారని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లాలో 2023 నవంబరు నుంచి 33 వేల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో దివ్యాంగుల ఆప్లికేషన్లు 3800 ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 60 వేల పెన్షన్లు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, అందులో 7400 దాకా దివ్యాంగుల అభ్యర్థనలు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 21 వేల దరఖాస్తులు రాగా, అందులో 2200 దివ్యాంగులు పెట్టుకున్నవే. పల్నాడు జిల్లాలో దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి 2410 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి వారం కనీసం 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయని అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మంజూరుచేసిన పెన్షన్లలో ఈ జిల్లాలో సుమారు 3 వేల వరకు అనర్హులున్నట్లు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. వారందరికీ ‘సదరం’ ధ్రువీకరణ జరుగుతోంది. కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో కొత్త దరఖాస్తులు ప్రతి వారం అందుతూనే ఉన్నాయి. బాపట్ల జిల్లాలో సుమారు 1800 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ కూడా పీజీఆర్‌ఎస్‌లో ప్రతి సోమవారం 10 మంది దివ్యాంగ పెన్షన్ల కోసం దరఖాస్తు ఇస్తూనే ఉన్నారు.
అది స్వర్ణ యుగమే..
ఉమ్మడిరాష్ట్రంలో సామాజిక పెన్షన్లు 69 లక్షలదాకా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ 13 జిల్లాలకు కలిపి 35.32 లక్షలు, తెలంగాణలో 33.83 లక్షలు పంపిణీ చేసేవారు. అప్పటి వరకు వృద్ధాప్య, వితంతువులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 ఇచ్చేవారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను ఐదురెట్లు పెంచి 2014 జూన్ 19న జీవో నెం.113 విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం వృద్ధాప్య, వితంతువులు, చేనేత, కల్లుగీత, కళాకారులకు రూ.1000 చొప్పున, దివ్యాంగులకు రూ.1500 చొప్పున ఇచ్చారు. అలాగే, పెన్షన్ల సంఖ్యను పెంచుతూ 2014 అక్టోబరు 25న జీవో నెం.140ను విడుదల చేశారు. కొత్తగా 3.72 లక్షల పెన్షన్లను ఆ ఉడాది అక్టోబర్, నవంబర్ నెలల నుంచి పంపిణీ చేశారు. ఆ తర్వాత డిసెంబరు 1న మరో 3.46 లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేస్తూ జీవోఆర్‌టీ నం. 1060 విడుదల చేశారు. ఆలస్యంగా మంజూరైనప్పటికీ వాటిని డిసెంబరులోనే పంపిణీ చేశారు. గిరిజనుల్లో ప్రిమిటివ్ ట్రైబల్స్ గ్రూప్‌లో శారీరకంగా చిన్న వయస్సులోనే వృద్ధాప్యం సంక్రమిస్తుంది. వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారి వయోపరిమితి వయస్సును 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారు. 2015 ఏప్రిల్ 18న జీవో నెం. 39 ద్వారా ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు మంజూరుచేశారు. అదే ఏడాది కొత్త పెన్షన్లు మరో 1.50 లక్షలు మంజూరుచేస్తూ జీవో 66 ఇచ్చారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు, అంటే 2018 డిసెంబరు నుంచి పెన్షన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచుతూ 2019 జనవరి 25న జీవో 13ను విడుదల చేశారు. దాని ప్రకారం రూ.1000 పొందుతున్న పెన్షన్‌దారులు రూ.2 వేలు, రూ.1500 పొందుతున్న దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచారు. ఇలా...అప్పటి వరకు ఇస్తు న్న మొత్తం 50.51 లక్షలతో పాటు అదనంగా మరో 3.55 లక్షల మంజూరుచేసి మొత్తం 54.06 లక్షలు ఇస్తున్నట్లు అప్పట్లో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలం లో 19 లక్షలకు పైగా పెన్షన్లు కొత్తగా మంజూరు చేశారు.
నాడు సాయం పిడికెడు.. షాక్‌లు బారెడు
జగన్ పాలనలో 12 లక్షల పెన్షన్లు కూడా కొత్తవి ఇవ్వలేదు. అధికారంలోకి వస్తే రూ. వెయ్యి పెంచి రూ.3వేలు చేస్తానన్న పెన్షన్‌ను ఒకేసారి పెంచలేదు. ప్రతి మూడు నెలలకోసారి రూ.250 చొప్పున పెంచేవారు. ఇలా పెన్షన్ మొత్తం పెంపుదల ఆలస్యం కావడంతో ఒక్కో పెన్షన్‌దారు రూ.13,500 నష్టపోయారు. ఈ రూపంలో రూ.8505 కోట్లు నాడు జగన్ సర్కారు ఎగ్గొట్టింది. పైగా జగన్ హయాంలో పెన్షన్‌దారులకు అన్నీ అవస్థలే... ఆర్నెల్లలో ఏదో ఒక నెల విద్యుత్ వినియోగ యూనిట్లు పెరిగితే, వారి పెన్షన్ రద్దుచేశారు. ఆరంచెల విధానం పేరిట పెన్షన్ దారులకు కంటి మీద నిద్ర లేకుండా చేశారు. ఆయా కుటుంబాల్లోని ఎవరైనా నగరాల్లో నివశిస్తూ ఉండి, ఎప్పుడో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్నా.... ఆ కుటుంబానికి పెన్షన్ కట్ చేశారు. అమ్మఒడి పథకానికి లబ్ధిదారులను కుదించేందుకు తెచ్చిన ఈ విధానాన్ని పెన్షన్ దారులకు కూడా అమలు చేయడంతో భారీగా పెన్షన్లు రద్దయ్యాయి. ఇలా సుమా రు 4లక్షల నుంచి 6లక్షల దాకా పెన్షన్లు రద్దు చేశారు. నాడు ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి. వరుసగా రెండు నెలలు తీసుకోకపోతే ఏకంగా రద్దు చేసేవారు.