Share News

పంచాయతీరాజ్‌నంబర్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:20 AM

గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ఠ కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత పూర్వ వైభవం దిశగా సాగుతోంది. పలు విభాగాల్లో ఉత్తమ పనితీరుతో అవార్డులు క్యూ కడుతున్నాయి.

పంచాయతీరాజ్‌నంబర్‌

  • కూటమి ప్రభుత్వంలో గణనీయమైన పురోగతి

  • గత వైసీపీ సర్కార్‌లో కేంద్ర పథకాలు నిర్వీర్యం

  • ఇప్పుడు ఒక్కో పథకానికి తిరిగి జవసత్వాలు

  • ఆర్జీఎస్ఏలో దేశంలో మనదే మొదటి స్థానం

  • ఉపాధి మెటీరియల్‌ నిధుల వాడకంలోనూ ఫస్ట్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ఠ కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత పూర్వ వైభవం దిశగా సాగుతోంది. పలు విభాగాల్లో ఉత్తమ పనితీరుతో అవార్డులు క్యూ కడుతున్నాయి. ఇందుకు తాజాగా రాష్ట్రంలోని పంచాయతీలకు జాతీయ పురస్కారాలు దక్కడమే నిదర్శనం. ముఖ్యంగా పంచాయతీరాజ్‌లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. జగన్‌ హయాంలో కేంద్ర పథకాలు అమలు చేయని మన రాష్ట్ర అధికారులకు మందలింపులు ఎదురు కాగా.. ఇప్పుడు మెరుగైన పనితీరుతో ప్రశంసలు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతోంది. గత 22 నెలల కాలంలో పలు అంశాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్జీఎస్ఏ) అమలు, ఉపాధి మెటీరియల్‌ నిధుల వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. జల, వర్షపు నీటి సంరక్షణలోనూ అవార్డులు దక్కాయి. సరికొత్త స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోంది.

శిక్షణలో 24 నుంచి అగ్రస్థానానికి..

వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా మంజూరు చేయకుండా పలు కేంద్ర పథకాల అమలును అడ్డుకుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ను అటకెక్కించింది. దీంతో అప్పట్లో కేంద్రం రాష్ట్రానికి ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో ఆర్‌జీఎ్‌సఏ అమల్లో ఏపీ దేశంలో 24వ స్థానంలో నిలబడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల. నిరంతర కృషితో ఇప్పుడు ఆర్‌జీఎ్‌సఏలో మన రాష్ట్రం మొదటి స్థానానికి చేరుకుంది.


మెటీరియల్‌ నిధుల్లో ముందంజ

ఉపాధి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్కీమ్‌ వినియోగంలో మన రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉండేది. గత టీడీపీ సర్కార్‌లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. అయితే వైసీపీ గద్దెనెక్కిన తర్వాత అంతా మారిపోయింది. మెటీరియల్‌ నిధులు దుర్వినియోగం చేశారు. లెవలింగ్‌ పనుల పేరుతో వైసీపీ కార్యకర్తలకు రూ.1,500 కోట్లు దోచిపెట్టారు. కూటమి సర్కార్‌ వచ్చాక మసకబారిన ప్రతిష్ఠను తొలగించుకునే యత్నాలు ప్రారంభించారు. పల్లెపండుగ 1.0 పేరుతో 10 వేల కిమీ సిమెంట్‌ రోడ్లు, 25 వేల మినీ గోకులాలు నిర్మించారు. పల్లెపండుగ 2.0 కింద ఇప్పటికే 50 శాతం సిమెంట్‌ రోడ్లు, మినీ గోకులాలను పూర్తి చేశారు. మంగళవారం నాటికి రూ.3,600 కోట్లు మెటీరియల్‌ బిల్లులు అప్‌లోడ్‌ చేసి దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది.

నీటి సంరక్షణలో అవార్డులు

నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యమిచ్చినందుకు జలసంచయ్‌-జన్‌ భాగీదారీ (జేఎస్‌జేబీ)-2025 అవార్డు దక్షిణ జోన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) జాతీయ అవార్డు సాధించింది. ఆ జిల్లాలో 2024లో 856 ఫారంపాండ్స్‌, 3,495 ఇంకుడు గుంతలు, 112 ఊట చెరువులు, 166 చెక్‌డ్యాంలు, 247 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. మొత్తంగా ఈ జిల్లాలో 5,502 భూగర్భ జలాల రీచార్జ్‌ పనులు పూర్తి చేశారు. దీంతో పాటు అన్నమయ్య జిల్లాలోని దుబ్బిగానిపల్లికి, ప్రకాశం జిల్లాలోని మురుగుమ్మి గ్రామ పంచాయతీలకు బెస్ట్‌ గ్రామపంచాయతీలుగా జాతీయ జల అవార్డులు పొందాయి. మరోవైపు పంచాయతీరాజ్‌ శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగులు పదోన్నతులు పొందుతున్నారు. ఈ శాఖలో ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించారు.


ఆదర్శంగా ‘స్వర్ణ పంచాయతీ’

పంచాయతీల్లో పారదర్శకతతో పాటు ఆదాయం పెంచేందుకు రూపొందించిన సరికొత్త స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. పంచాయతీ పన్నులు చెల్లిస్తే ఎవరికి చేరుతాయో తెలియని పరిస్థితి నుంచి.. ఆన్‌లైన్‌లో పన్ను చెల్లింపు ద్వారా వెంటనే బిల్లు మొబైల్‌కు వచ్చేస్తోంది. 96 లక్షల అసెస్‌మెంట్లతో పంచాయతీల ఆదాయం రూ.1,000 కోట్లకు చేర్చారు. పారదర్శకత పెరగడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా చెల్లింపులు వేగవంతమయ్యాయి. వీటితో పాటు ఆర్థిక సంఘం నిధుల వ్యయం, సిబ్బంది డేటాబేస్‌ను పోర్టల్‌లో ఉంచడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ దేశంలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. మన స్వర్ణ పంచాయతీల కాన్సెప్ట్‌ దేశానికి ఆదర్శంగా ఉంది.

Updated Date - Apr 01 , 2026 | 05:21 AM