Share News

పీఆర్‌ ఉద్యోగులకు త్వరలో శిక్షణ

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:03 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్టు ఏపీ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌(ఏపీఎస్ఐఆర్‌డీ) కమిషనర్‌ వెంకటకృష్ణ తెలిపారు.

పీఆర్‌ ఉద్యోగులకు త్వరలో శిక్షణ

  • ప్రజాప్రతినిధులకు కూడా ట్రైనింగ్‌

  • సిబ్బందికి విధి నిర్వహణపై,నేతలకు పాలనా నైపుణ్యంపై శిక్షణ

  • మండలస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు

  • శిక్షణ కేంద్రాల్లో వసతులకు ప్రాధాన్యం

  • ఎస్‌ఐఆర్‌డీ కొత్త కమిషనర్‌ వెంకటకృష్ణ

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్టు ఏపీ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌(ఏపీఎ్‌సఐఆర్‌డీ) కమిషనర్‌ వెంకటకృష్ణ తెలిపారు. దీనికిగాను త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలోని ఏపీఎస్ఐఆర్‌డీ సంస్థలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రంలోని నాలుగు ఎక్స్‌టెన్షన్‌ టైనింగ్‌ సెంటర్ల(ఈటీసీ) ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే శిక్షణ.. సర్టిఫికేట్లు కోసం ఇచ్చేదిగా ఉండరాదని, ఇది ఉద్యోగులకు కెరీర్‌ అడ్వాన్స్‌గా, ప్రజాప్రతినిధులకు పాలనాపరమైన నైపుణ్యం అందించేదిగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో లక్ష మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, లక్ష మంది స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామ పంచాయతీలకు అనుబంధంగా పనిచేసే మరో లక్ష మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.


ఆ మేరకు మౌలిక వసతుల కల్పన కూడా జరగాలన్నారు. జిల్లాల్లో డీపీఆర్‌సీ కేంద్రాలతో పాటు అందుబాటులో ఉన్న హోటళ్లు, రెసిడెన్షియల్‌ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయాలని సూచించారు. అదేవిధంగా మండల స్థాయిలోని రిసోర్స్‌ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే శిక్షణ ఇస్తున్న సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తి విస్తరణ కేంద్రాల్లో వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని సూచించారు. ఇక నుంచి ఎస్‌ఐఆర్‌డీ నుంచి ‘ఈ-పేపర్‌’ విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీరాజ్‌లో శిక్షణ తీసుకోవాల్సిన సిబ్బంది, ప్రజాప్రతినిధుల జాబితాతో డేటా బేస్‌ రూపొందించాలని, అదేవిధంగా శిక్షణ ఇచ్చేందుకు రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, ఎన్జీఓలు, అనుభవజ్జులైన మాజీ ప్రజాప్రతినిధులను గుర్తించాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. శిక్షణ పొందిన ప్రతి ఉద్యోగి ప్రాజెక్టు సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెల రోజుల్లో శిక్షణ కేలండర్‌ రూపొందించాలని, ఒకసారి రూపొందించిన కేలండర్‌తోనే ఏడాది పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.


సిబ్బందిని రిలీవ్‌ చేయాల్సిందే!

శిక్షణ పొందాల్సిన సిబ్బందిని రిలీవ్‌ చేయడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించనున్నట్టు వెంకటకృష్ణ తెలిపారు. బ్యూరోక్రాట్లకు ఉన్న శిక్షణా నిబంధనల మాదిరిగా పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు కూడా రూపొందించాలని సూచించారు. మరింత నాణ్యమైన, ఉన్నత శిక్షణ కోసం ప్రతి పంచాయతీరాజ్‌ ఉద్యోగిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని, కనీసం నాలుగైదు రాష్ట్రాల్లో శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ కేఎస్‌ వరప్రసాద్‌, ఈటీసీ కేంద్రాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 05:04 AM