స్తంభించిన ‘సహకారం’
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:49 AM
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మె కారణంగా పీఏసీఎస్‌ల్లో ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల రికవరీ ప్రక్రియ నిలిచిపోయింది.
పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
నిలిచిపోయిన రుణాల రికవరీ
సొసైటీల్లో లావాదేవీలు, రైతు సేవలకు ఆటంకం
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మె కారణంగా పీఏసీఎస్‌ల్లో ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల రికవరీ ప్రక్రియ నిలిచిపోయింది. పీఏసీఎస్ ఉద్యోగుల హెచ్‌ఆర్ పాలసీకి సంబంధించి 2019 మార్చి 1న అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను అమలు చేయకపోవడం, దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్ల పీఏసీఎస్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వాస్తవంగా 2019 మార్చిలో జీవో వచ్చినా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా అమలు కాలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా... మరో జీవో జారీచేసి, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు తయారు చేసి, బదిలీలు చేయాలని భావించింది. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏదీ ముందుకు తీసుకెళ్లకుండా, ఐదేళ్లు కాలక్షేపం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పీఏసీఎస్ ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు నిరవధిక సమ్మె ప్రారంభించారు. అత్యధిక శాతం సీఈవోలు, అసిస్టెం ట్ ఎగ్జిక్యూటీవ్‌లు, ఇతర సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. పంట రుణాలు, దీర్ఘకాల వ్యవసాయ రుణాలను రికవరీ సమయంలో ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా 2వేలపైగా పీఏసీఎ్‌సల్లో లావాదేవీలు స్తంభించాయి. వేల కోట్ల రుణాల రికవరీ నిలిచిపోయింది. గతేడాదిగా పీఏసీఎ్‌సలు కం ప్యూటరీకరణ జరగడంతో రుణాల రీషెడ్యూల్, పుస్తకాల్లో సర్దుబాటు వంటివి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ప్రతి రైతు నుంచి రుణాల అసలు, వడ్డీ వసూ లు చేసి, డీసీసీబీలకు జమ చేయాల్సి ఉంది. ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో.. ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. సమ్మె నేపథ్యంలో హెచ్‌ఆర్ పాలసీ అమలుకు నిర్ధిష్ట కాలపరిమితితో ప్రభుత్వం రూట్ మ్యాప్ ప్రకటించింది. కంప్యూటరీకరణ తర్వాత పీఏసీఎ్‌సల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు సిఫారసులు చేయడానికి, హెచ్‌ఆర్ పాలసీ సమస్యను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
ఫలితమివ్వని ప్రత్యామ్నాయ చర్యలు
సమ్మె కాలంలో పీఏసీఎస్‌ల్లో రైతుసేవలకు అసౌకర్యం కలగకుండా సహకార శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. డీసీసీబీల్లోని సూపర్‌వైజర్లు, స్టాఫ్ అసిసెంట్లను పీఏసీఎ్‌సల్లో తాత్కాలికంగా ఇన్‌చార్జీలుగా నియమించాలని సహకార శాఖ కమిషనర్ ఆప్కాబ్ ఎండీకి లేఖ రాశారు. దీనిపై ఏపీ కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల సహకారం లేకుండా డీసీసీబీ అధికారులు రైతులతో లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు, రికా ర్డుల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. డీసీసీబీ సూపర్‌వైజర్లు, స్టాఫ్ అసిస్టెంట్లను పీఏసీఎస్‌లకు ఇన్‌చార్జీలుగా నియమిస్తే, డీసీసీబీల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని స్పష్టం చేసింది. అలాగే పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళనను పరోక్షంగా పలుచన చేయడం తమకిష్టం లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ఓవైపు పీఏసీఎస్ ఉద్యోగుల సమ్మె, మరోవైపు డీసీసీబీ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలతో సమస్య జఠిలమౌతోంది. ఈ పరిస్థితుల్లో పీఏసీఎ్‌సల్లో సేవలకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉన్న సహకార శాఖ ఉద్యోగులను వినియోగించవచ్చని అనుకుంటున్నారు.