Share News

థాంక్యూ.. సీఎం సార్‌

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:58 AM

సీపీఎస్‌లో ఉన్న 10,715 మంది ఉద్యోగ , ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో..

థాంక్యూ.. సీఎం సార్‌

  • రెండు దశాబ్దాల కల సాకారం .. ‘ఓపీఎ్‌స’పై ఉద్యోగ సంఘాల హర్షం

  • సచివాలయంలో పోస్టర్ల ప్రదర్శన.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

  • వెంకట్రామిరెడ్డి తీరుపై విమర్శలు .. యూటీఎఫ్‌ కార్యాలయంలో కేక్‌ కటింగ్‌

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌లో ఉన్న 10,715 మంది ఉద్యోగ , ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 2 దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారని, తమ కు పదవీ విరమణ అనంతర జీవితానికి భరోసా ఇచ్చారని సంతోషం వ్యక్తం చే శారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ ప్రసాద్‌, 2003 ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ లక్ష్మీ శ్రీనాథ్‌ సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. సీఎం చంద్రబాబుకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో మూడు నాలుగుసార్లు క్యాబినెట్‌ ముందుకు వెళ్లినా పక్కన పడేశారన్నారు. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలంటే సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఏమీ చేయలేదని గుండు కొట్టించుకున్నానని వెంకట్రామిరెడ్డి అంటున్నారని, అసలు ఆయన ఉద్యోగే కాదని, ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కే లేదని రామకృష్ణ విమర్శించారు. ‘గత ఐదు సంవత్సరాలు సచివాలయ సంఘం అఽధ్యక్షుడిగా పని చేసినప్పు డు ఉద్యోగులకు గుండు కొట్టించింది నువ్వు.. రివర్స్‌ పీఆర్సీ ఇప్పించింది నువ్వే. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు పెండింగ్‌లో పెట్టించింది నువ్వే’ అని వెంకట్రామిరెడ్డిపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 30 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలున్నా ఏరోజూ మాట్లాడలేదన్నారు. ఇకనుంచైనా ఉద్యోగులను వదిలిపెట్టి, ఆయన రాజకీయ కోణంలో రాజకీయ పనులు చేసుకుంటే బాగుంటుందన్నారు. ఉద్యోగులను ఆయన ఉచ్చులోకి లాగొద్దని హితవు పలికారు.


ఏపీసీపీఎస్ఈఏ హర్షం

సీఎం చంద్రబాబుకు ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా, గ్రాట్యుటీ ఇచ్చిన రెండో రాష్ట్రంగా సీఎం చంద్రబాబు మేలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే విధంగా జీవో జారీ చేయడంపై ఏపీ డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర కన్వీనర్‌ శ్రీనాథ్‌ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

యూటీఎఫ్‌ ఆఽధ్వర్యంలో సంబరాలు

విజయవాడలోని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను గుర్తించి వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ అధ్యక్షుడు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గతంలో సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్‌ వంటి కీలక ప్రయోజనాలను ముఖ్యమంత్రి కల్పించారన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 05:00 AM