పూడికను అడ్డు పెట్టుకుని ‘నావలి’ కడతామంటే ఎలా?
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:38 AM
‘‘తుంగభద్ర జలాశయంలో పూడికను అడ్డుపెట్టుకుని 30 టీఎంసీల సామర్థ్యంతో ‘నావలి’ ఎత్తిపోతల ప్రాజెక్టును కడతామంటే ఎలా?’’ అని తుంగభద్ర హైపవర్ కమిటీని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రశ్నించింది.
ఎత్తిపోతల ప్రాజెక్టు కడితే మాకు మరో 15 టీఎంసీలివ్వాలి
తుంగభద్ర హైపవర్ కమిటీకి తేల్చి చెప్పిన జలవనరుల శాఖ
‘రాజోలిబండ’ విస్తరణకూ.. నో
అమరావతి/హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘తుంగభద్ర జలాశయంలో పూడికను అడ్డుపెట్టుకుని 30 టీఎంసీల సామర్థ్యంతో ‘నావలి’ ఎత్తిపోతల ప్రాజెక్టును కడతామంటే ఎలా?’’ అని తుంగభద్ర హైపవర్ కమిటీని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రశ్నించింది. ఇసుక మేటలు, పూడిక తీతలకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించింది. ఒకవేళ ‘నావలి’ ప్రాజెక్టును కట్టాలని భావిస్తే ఏపీకి మరో 15 టీఎంసీల నీటిని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ మేరకు తుంగభద్ర బేసిన్‌లో సమస్యల పరిష్కారం కోసం వేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఏపీ స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సభ్యుడు యోగేశ్ పైథాంకర్ అధ్యక్షతన సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్) రమేశ్‌బాబు, ఏపీ ఈఎన్‌సీ(ఇరిగేషన్) నర్సింహామూర్తి, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి బీఎస్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తుంగభద్ర వద్ద భారీగా పేరుకుపోయిన పూడిక.. రాజోలిబండ మళ్లింపు పథకం వద్ద ఇసుకమేటల తొలగింపుపై చర్చించారు. తుంగభద్ర జలాశయం వద్ద పూడికతీత కష్టంతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలో.. నావలి వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని కర్ణాటక ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఏపీ ఈఎన్‌సీ తీవ్రంగా వ్యతిరేకించారు. పూడికతీతకు ఉన్న అవకాశాలను పరిశీలించాకే.. నావలి ఎత్తిపోతల నిర్మాణంపై నిర్ణయం తీసుకుందామని తేల్చిచెప్పారు. రాజోలిబండ ఎత్తిపోతల పథకాన్ని విస్తరిస్తామన్న తెలంగాణ ప్రతిపాదననూ ఆయన వ్యతిరేకించారు. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎ్‌స)లోనూ పూ డికతీతతో పాటు.. నీటి ప్రవాహం సజావుగా సాగేలా కాలువ మరమ్మతులు చేపట్టాలని ఏపీ స్పష్టం చేసింది. కాగా, 9 మంది అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశంలో తుంగభద్ర జలాశయంలో పూడికతీతపై ఉప సంఘం వేయాలని సభ్యులు నిర్ణయించారు.