బీపీసీఎల్‌కు భారీ ప్రోత్సాహకాలు
ABN , Publish Date - May 21 , 2026 | 04:31 AM
నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడులతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం ..
స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడులతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏడాదికి 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేటాయించిన 6 వేల ఎకరాలకు బదులుగా 6,042 ఎకరాలను వ్యయ ప్రాతిపదికన బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మ్యారిటైం బోర్డు నుంచి ఏపీఐఐసీకి, తర్వాత ఏపీఐఐసీ నుంచి బీపీసీఎల్‌కు భూముల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. మొత్తం 6,042 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.127.68 కోట్లకు పైగా, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.19.64 కోట్లకు పైగా మినహాయింపు లభించడంతో బీపీసీఎల్‌కు మొత్తంగా రూ.147.33 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న 480.89 ఎకరాల ప్రభుత్వ భూములను బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 6,042 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే పట్టా భూముల మ్యూటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ మ్యారీటైం బోర్డు సీఈవో, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.