పట్టణాభివృద్ధి ఇక రయ్.. రయ్!
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:02 AM
ఏపీలో పట్టణాభివృద్ధి, భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన భూవినియోగ నిబంధనలు అమలు చేస్తూ..
అమల్లోకి కొత్త ‘కామన్ జోనింగ్’ నిబంధనలు
రాష్ట్రవ్యాప్తంగా ఒకే భూవినియోగ విధానం
తొమ్మిది కేటగిరీలుగా భూముల విభజన
భవన నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతులు మరింత వేగిరం
‘నెగటివ్ లిస్ట్’ విధానంతో అనుమతుల మంజూరు
పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
పర్యావరణ పరిరక్షణ, ప్రజాభద్రతకు భంగం
కలగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన భూవినియోగ నిబంధనలు అమలు చేస్తూ కామన్ జోనింగ్ రెగ్యులేషన్స్-2026ను అధికారికంగా నోటిఫై చేసింది. దీంతో ఇకపై పట్టణాలు, నగరాల్లో భూమి వినియోగానికి సంబంధించి వేర్వేరు మాస్టర్ ప్లాన్లు, భిన్నమైన జోనింగ్ నిబంధనల స్థానంలో ఏకీకృత విధానం అమల్లోకి రానుంది. రాజధాని నగర ప్రాంతం మినహా రాష్ట్రంలోని అన్ని మాస్టర్ ప్లాన్లు, జోనల్ డెవల్‌పమెంట్ ప్లాన్లు, జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 2025 అక్టోబరు 22న జారీచేసిన జీవో 216 స్థానంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ కొత్త నిబంధనలు భవన అనుమతుల్లో వేగం పెంచడంతో పాటు, పెట్టుబడులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వనున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతులు పొందే విషయంలో పట్టణానికో విధానం, అథారిటీకి మరో విధానం అమల్లో ఉండటంతో ప్రజలు, ఇంజనీర్లు, డెవలపర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన జోనింగ్ విధానాన్ని రూపొందించింది. దీంతో ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టం(ఓబీపీఎ్‌స)లో అన్ని పట్టణాలకు ఒకే విధమైన డిజిటల్ ప్రాసెసింగ్ ఉంటుంది. కొత్త కామన్ జోనింగ్ రెగ్యులేషన్స్ నిబంధనల అమలుతో రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి మరింత పారదర్శకంగా, వేగవంతంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
9 కేటగిరీలుగా భూవినియోగం
కొత్త నిబంధనల ప్రకారం భూమి వినియోగాన్ని 9 ప్రధాన విభాగాలుగా విభజించారు. నివాస, వాణిజ్య, ప్రభుత్వ, సెమీ పబ్లిక్, వినోద, పారిశ్రామిక, రవాణా, మిశ్రమ వినియోగం, వ్యవసాయ, అభివృద్ధి పరిమిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. కొత్త జోనింగ్ విధానంలో అత్యంత కీలకమైన మార్పు ‘నెగిటివ్ లిస్ట్’. ఇప్పటి వరకు ఏ కార్యకలాపాలకు అనుమతి ఉందో ప్రత్యేకంగా పేర్కొనేవారు. ఇకపై ఏ జోన్‌లో ఏ కార్యకలాపాలు నిషేధమో మాత్రమే జాబితా రూపొందిస్తారు. భూమి ఆ జాబితాలో లేకపోతే సంబంధిత నిబంధనలకు లోబడి అనుమతి పొందే అవకాశముంటుంది. అయితే ఇది నియంత్రణలు సడలించినట్లు కాదని, భవన నిబంధనలు, పర్యావరణ చట్టాలు, రోడ్ల వెడల్పు, పార్కింగ్, భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల నిబంధనలు యథాతధంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నివాస ప్రాంతాల్లో వీటికి నో!
నివాస ప్రాంతాల్లో కాలుష్య పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాల నిల్వ కేంద్రాలు, భారీ గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్‌లు, స్లాటర్ హౌస్‌లు, మైనింగ్, వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు అనుమతి ఉండదు. అలాగే పార్కులు, చెరువులు, అడవులు, కొండలు, వారసత్వ కట్టడాలు, తీరప్రాంత నియంత్రణ ప్రాంతాల్లో అనుకూలం కాని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు.
మిశ్రమ వినియోగానికి ప్రోత్సాహం
పట్టణాల్లో ఒకే భవనంలో నివాసంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం కల్పించే ‘మిశ్రమ వినియోగ అభివృద్ధి’కి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అదేవిధంగా 300 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి, 60 అడుగుల వెడల్పు రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాల్లో కొన్ని వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేక చార్జీలు చెల్లించి, అనుమతి పొందే అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు పార్కులు, రక్షిత ప్రాంతాలు, కొండలు, ప్రజా అవసరాల భూములకు వర్తించదు.
వ్యవసాయ భూముల్లోనూ అవకాశాలు
వ్యవసాయ జోన్లలో కూడా పరిమిత అభివృద్ధికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులతో వైట్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలకు అవకాశం. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా నివాస ప్రాజెక్టులకు వీఎంఆర్‌డీఏ, ఏపీసీఆర్‌డీఏ, తుడా పరిధిలో 10 హెక్టార్ల వరకు, ఇతర అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల పరిధిలో 5 హెక్టార్ల వరకు అనుమతి. విద్యాసంస్థలు కూడా నిర్దిష్ట నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వ్యవసాయ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించాలంటే కనీసం అర ఎకరా స్థలం ఉండాలి, భూమిలో 10 శాతం మాత్రమే నిర్మాణం చేపట్టాలి. గరిష్ట ఎత్తు 11 మీటర్లు మాత్రమే ఉండాలి. ఇప్పటికే చట్టబద్దంగా మంజూరైన లేఅవుట్లు, భవనాలు, భూ వినియోగ మార్పు అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వినియోగాలను మరింత విస్తరించేందుకు అనుమతులుండవు.
సమర్థంగా డిజిటల్ అనుమతుల వ్యవస్థ
ఈ నిబంధనల ముసాయిదాను 2026 ఏప్రిల్ 9న గెజిట్‌లో ప్రచురించిన ప్రభుత్వం.. ప్రజలు, పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీచేసింది. కొత్త జోనింగ్ విధానం ద్వారా భవన అనుమతుల ప్రక్రియలో జాప్యాలు తగ్గుతాయి. అన్ని పట్టణాల్లో ఒకే నిబంధనలు అమలవుతాయి. అధికారుల విచక్షణాధికారం తగ్గుతుంది. డిజిటల్ అనుమతుల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఊతం లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజాభద్రతకు భంగం కలగకుండా పట్టణాభివృద్ధి కొనసాగుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో కీలక మైలురాయిగా మరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.