Share News

ఏపీ నిట్‌.. అదే తంతు!

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:32 AM

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌)లో వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీట్లు పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడంతో మౌలిక వసతుల....

ఏపీ నిట్‌.. అదే తంతు!

  • వచ్చే ఏడాదీ 480 సీట్లకే అడ్మిషన్లు .. వసతుల కొరతతో తగ్గింపు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌)లో వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీట్లు పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పన ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా విద్యార్థులకు హాస్టల్‌ వసతికి సమస్య ఏర్పడటంతో మూడేళ్ల క్రితం నిట్‌లో సీట్లను తగ్గించారు. అప్పటి వరకు ఏటా 750 మందికి అడ్మిషన్లు కల్పించేవారు. తర్వాత 480 సీట్లకు తగ్గించారు. ఓవైపు కేంద్రం మంజూరు చేసిన 62 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయలేకపోయారు. రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేకపోవడంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు పోస్టులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నోటిఫికేషన్‌ దగ్గరే భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఫ్యాకల్టీ పోస్టుల కోసం మొత్తం 3 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని భర్తీ చేయాల్సి ఉంది. ఇంకోవైపు డైరెక్టర్‌ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసి ఏడాది పూర్తయింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ము గ్గురు అభ్యర్థులను గుర్తించారు. వారిలో ఒకరిని డైరెక్టర్‌గా నియమించాల్సి ఉంది. రోజులు గడిచిపోతున్నా నియాకంపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఇదిలాఉంటే హాస్టల్‌ వసతితో పాటు, అకడమిక్‌ భవనాలు, ఇతర మౌలిక సదుపాయల కోసం రూ.400 కోట్లు మంజూరు చేయాలని ఏపీ నిట్‌ నుం చి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆర్థికశాఖ వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ఈ నిధులు మంజూరైతే విద్యార్థులకు అవసరమైన సదుపాయాల తో పాటు మళ్లీ 750 సీట్లకు అడ్మిషన్లు కల్పించనున్నారు. కేంద్రం నుంచి ఇంతవరకూ స్పందన లేకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరంలోనూ 480 సీట్లకే అడ్మిషన్లు కల్పించేలా నిట్‌ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Feb 22 , 2026 | 04:32 AM