Alaparthi Vidyasagar: ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యం
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:26 AM
ఏడున్నర దశాబ్దాలుగా రాజకీయ పార్టీలతో అనుబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏపీఎన్జీజీవో పనిచేస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
విజయవాడ (గాంధీనగర్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఏడున్నర దశాబ్దాలుగా రాజకీయ పార్టీలతో అనుబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏపీఎన్జీజీవో పనిచేస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడారు. మూడేళ్ల రాష్ట్ర కమిటీ కాలపరిమితి ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. తాలూకా, జిల్లాస్థాయి, విజయవాడ నగరశాఖ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు తమ సంఘంలో సభ్యత్వం పొందడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు ఎన్జీజీవో సంఘం సాధించినవేనన్నారు. గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పీఆర్సీ నియామకం, హెల్త్‌కార్డు వినియోగంలో సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సంఘం ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలకు ప్రాధాన్యమిస్తామని, ప్రభుత్వం మొండికేస్తే ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘ సహాధ్యక్షుడు వి.దస్తగిరి, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు జగదీశ్వరరావు, కోశాధికారి ఎన్.భారతీయ ప్రసాద్, ఉమెన్స్ వింగ్ కన్వీనర్ పి.మాధవి తదితరులు పాల్గొన్నారు.