Share News

1,000 కోట్లు ఇచ్చేవరకూ వైద్యం బంద్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:39 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెండు వారాల్లోగా రూ.1000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే..

1,000 కోట్లు ఇచ్చేవరకూ వైద్యం బంద్‌

  • బకాయిలు విడుదలయ్యే వరకూ సేవలు నిలిపివేస్తామన్న ఆషా

అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెండు వారాల్లోగా రూ.1000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే.. ఆ బకాయిలు విడుదల చేసేవరకూ వైద్య సేవల నిలిపివేత కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆషా మధ్య బుధవారం సానుకూల వాతావరణంలో జరిగిన చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఆషా ప్రతినిధులు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రావాల్సిన రూ.3000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ అడిషినల్‌ సీఈవో డా.కె.అప్పారావు స్పందిస్తూ.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఉన్న బకాయిలు రూ.2,100 కోట్లు మాత్రమేనని, అలాంటప్పుడు రూ.3,000 కోట్లు ఎలా క్లెయిమ్‌ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం బకాయిపడిన రూ.2,100 కోట్లలో రూ.1,000 కోట్లు రెండు వారాల్లోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అలాగే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రతినెలా విడుదల చేసే రూ.250 కోట్లను కూడా ఆపకుండా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల విన్నపం మేరకు యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ను మూడు నెలలు వాయిదా వేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. అనంతరం ఆషా జనరల్‌ బాడీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పిన రూ.1,000 కోట్లు విడుదల చేసేవరకూ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవల నిలిపివేతను కొనసాగించాలని నిర్ణయించింది.

Updated Date - Apr 02 , 2026 | 04:39 AM