Share News

ప్రకృతి వ్యవసాయానికి ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:21 AM

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారం ‘ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌’ 2026 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి ...

ప్రకృతి వ్యవసాయానికి ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారం ‘ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌’ 2026 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్)కు దక్కింది. రసాయన పద్ధతుల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మలిచే ఆగ్రో ఎకాలజీలో కీలకపాత్ర పోషించినందుకు ఏపీసీఎన్‌ఎఫ్ కు ఈ గౌరవం లభించింది. 15లక్షల అమెరికన్‌ డాలర్ల విలువైన ఈ పురస్కారాన్ని మంగళవారం (జూన్‌ 2) స్వీడన్‌లోని ‘కర్ట్‌ బర్గ్‌ఫోర్స్‌ ఫౌండేషన్‌’ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, ఏపీ రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ తల్లం విజయ్‌కుమార్‌ అందుకున్నారు. ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌ విజేతగా ఏపీసీఎన్‌ఎ్‌ఫను ‘కర్ట్‌ బర్గ్‌ఫోర్స్‌ ఫౌండేషన్‌’ ఎంపిక చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఏపీసీఎన్‌ఎఫ్లో మహిళా సంఘాలతోపాటు 10వేల మందికిపైగా రైతు శిక్షకులున్నారు. రసాయన ఎరువులు, కృత్రిమ ఉపకరణాలకు బదులుగా మృత్తికా శాస్త్రం, సంప్రదాయ పరిజ్ఞానంపై ఆధారపడిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రకృతి సేద్య విధానాన్ని రైతాంగానికి ఆదర్శంగా తీసుకెళ్తున్న ఏపీసీఎన్‌ఎఫ్‌ జాతీయ, అంతర్జాతీయంగా ఇప్పటికే అనేక పురస్కారాలు పొందింది.

ప్రపంచ వేదికపై ఏపీ కీర్తి పతాకం: అచ్చెన్న

ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌-2026 పురస్కారంతో ఏపీ కీర్తి పతాకం ప్రపంచ వేదికపై రెపరెపలాడిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీసీఎన్‌ఎఫ్‌ సాధించిన ఈ పురస్కారం దేశానికే గర్వకారణమని, ఈ గౌరవాన్ని ప్రకృతి సేద్యం అనుసరిస్తున్న రైతులు, మహిళా సంఘాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్పూర్తితో 100 శాతం ప్రకృతి వ్యవసాయం అమలుచేసే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు.

ఎంతో గర్విస్తున్నా: సీఎం

ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా రాష్ట్ర రైతులు ప్రపంచ వేదికపై రాణిస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నానని సీఎం చంద్రబాబు బుధవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌ను ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ గెలుచుకుంది. ప్రస్తుతం 1.8 మిలియన్ల రైతుల ఉద్యమంగా, ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వ్యవసాయ కార్యక్రమంగా ఎదిగినందుకు, ఏపీసీఎన్‌ఎఫ్ను ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌కు ఎంపిక చేసినందుకు స్వీడన్‌ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నా. 2047 నాటికి ఏపీని 100ు సహజ వ్యవసాయ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’ అని సీఎం పేర్కొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 04:21 AM