Share News

మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో మార్పులు

ABN , Publish Date - May 02 , 2026 | 03:57 AM

మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరగడం వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ..

మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో మార్పులు

  • మూడేళ్లకు 33.33 శాతం బదులు.. ఏటా 7 శాతం పెంపు

  • పై అంతస్థుల్లోని షాపులకు అద్దె తగ్గింపు

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరగడం వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ విధానాన్ని ప్రభుత్వం సవరించింది. ఇకపై మూడేళ్లకోసారి 33.33 శాతం పెంపునకు బదులుగా ప్రతి సంవత్సరం 7 శాతం చొప్పున అద్దె పెంచే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం మూడేళ్లకోసారి భారీగా అద్దె పెరగడం వల్ల చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసులు పెరగడంతోపాటు అద్దె చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయి. రాష్ట్రంలోని 18 పట్టణ స్థానిక సంస్థల్లో 584 కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.9.43 కోట్లు బకాయిలుగా నిలిచిపోయాయి. కొత్త విధానం ద్వారా వ్యాపారులకు భారం లేకుండా ఉంటుందని, అద్దె చెల్లింపులు సక్రమంగా జరుగుతాయని, మున్సిపాలిటీలకు స్థిరమైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. కాగా, ఖాళీగా ఉంటున్న పై అంతస్తుల షాపులను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌కు సాధారణ అద్దె, ఫస్ట్‌ ఫ్లోర్‌కు 20 శాతం తక్కువ, పై అంతస్తులకు 30 శాతం తక్కువతో అద్దె నిర్ణయించారు. కొత్తగా లేదా మళ్లీ లీజుకు ఇస్తే అద్దె నిర్ణయం మూడు అంశాల ప్రాతిపదిక ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్‌ విలువలో 10 శాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న అద్దె, లేదా గత అద్దెపై 7 శాతం పెంపు.. ఈ మూడు అంశాల్లో ఎక్కువగా ఉన్న దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. లీజ్‌ నిబంధనల ప్రకారం.. మూడేళ్ల వరకు మున్సిపాలిటీలు, 3 నుంచి 25 ఏళ్ల లీజుకు ప్రభుత్వ అనుమతి అవసరం. ప్రస్తుతమున్న లీజ్‌ ఒప్పందాలు పూర్తయిన తర్వాతే కొత్త 7 శాతం పెంపు అమల్లోకి వస్తుంది.

Updated Date - May 02 , 2026 | 03:57 AM