Share News

ఆ పదవులకు ‘ప్రత్యక్ష’ ఎన్నికలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:04 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్‌ పదవులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దీంతో రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పరోక్ష పద్ధతిలో..

ఆ పదవులకు ‘ప్రత్యక్ష’ ఎన్నికలు

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కార్పొరేషన్‌ మేయర్లను ప్రజలే ఎన్నుకునే చాన్స్‌

  • పురపాలక చట్టం నాలుగో సవరణ.. బిల్లుకు శాసనసభ ఆమోదం

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్‌ పదవులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దీంతో రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లను ఇక నుంచి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక చట్టం నాలుగో సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజామోదంతో ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్‌, చైర్మన్లపై రాజకీయ ప్రభావం, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఒత్తిళ్లు తగ్గి, మెరుగైన పరిపాలనకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, కాల్వ శ్రీనివాసులు, పార్థసారధిలు మాట్లాడారు.


అవయవ మార్పిడి బిల్లుకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు-2026కు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధవారం సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 5,920 మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వీరిలో దాదాపు 100 మంది గుండె, 3 వేల మంది కిడ్నీ, 2 వేల మంది కాలేయం(లివర్‌) మార్పిడి కోసం నిరీక్షిస్తున్నారని వివరించారు. పాంక్రియాస్‌ మార్పిడి కోసం నలుగురు ఉన్నారని చెప్పారు. బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తుల అవయవదానానికి ముందుకు వచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.10 వేల ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు తెలిపారు.


4 ఉన్నత విద్యాశాఖ బిల్లులకు కూడా..

ఉన్నత విద్య సంస్కరణలకు సంబంధించిన మరో 4 బిల్లులకు కూడా రాష్ట్ర శాసనసభ ఆమోదం లభించింది. ఉన్నత విద్య సంస్కరణల్లో భాగంగా ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరీ కమిషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2026, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు-2026, ఏపీ స్టేట్‌ ప్రైవేట్‌ స్కిల్‌ యూనివర్సిటీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్‌ రెగ్యులేషన్‌ బిల్లు-2026, ఏపీ స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రిజర్వేషన్‌ ఇన్‌ టీచర్స్‌ క్యాడర్‌ బిల్లు-2026లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ ఈ బిల్లుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఈ 4 బిల్లులు ఆమోదం పొందినట్లుగా స్పీకర్‌ ప్రకటించారు.

ఏపీ ఒమ్నిబస్‌ బిల్లు

ఆంధ్రప్రదేశ్‌ ఒమ్నిబ్‌స(స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పలువురు ఎమ్మెల్యేలు ఈ బిల్లును సమర్థించారు. అనంతరం ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో బిల్లు ఆమోదం పొందింది.

Updated Date - Aug 20 , 2026 | 03:06 AM