మున్సిపల్ ఎన్నికలకు పచ్చజెండా
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:08 AM
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ముందస్తు ఏర్పాట్లకు సర్కారు ఆదేశం.. బీసీలకు 33.33శాతం రిజర్వేషన్లకు ఓకే
ప్రాథమిక సమాచారం సిద్ధం చేసుకోండి.. కలెక్టర్లు, అధికారులతో పునేఠా కాన్ఫరెన్స్
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బీసీలకు 33.33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వాటిలో ఇప్పటికే 87 స్థానికసంస్థల పదవీకాలం ముగిసింది. 13 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం నవంబరు నాటికి ముగియనుంది. ఇక, కోర్టు కేసులు తదితర కారణాలతో 23 సంస్థల ఎన్నికలు పెండింగులో పడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం 100పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలావుంటే, ప్రస్తుత చట్టపరమైన నిబంధనల ప్రకారం బీసీలకు మూడో వంతు (33.33 శాతం) రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు, ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల వారీగా అవసరమైన ప్రక్రియ, రిజర్వేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర చట్టబద్ధమైన ముందస్తు చర్యలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
విధి విధానాలపై శిక్షణ: కమిషనర్ పునేఠా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు నిబంధనలు, విధివిధానాలు, బాధ్యతలపై దశలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రధానంగా మూడు దశల ఎన్నికల సరళిపై చర్చించారు.
పక్కా ప్రణాళిక
పట్టణ స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన 15వ రోజున పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ముగిసిన 18వ రోజున ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ఉంటుందని పునేఠా వివరించారు. మేయర్/మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఓటర్లకు రెండు ఓట్లు వేసే అవకాశం ఉన్నందున దీనిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన 16వ రోజున పోలింగ్ నిర్వహించి, 19వ రోజున ఫలితాలు ప్రకటించే విధంగా షెడ్యూల్ ఉంటుందని పునేఠా చెప్పారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించాలని, అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని తెలిపారు.
ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించాలని, తద్వారా రిజర్వేషన్ నిర్ధారించే అవకాశముంటుందని కమిషనర్ సూచించారు. ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు.