శ్మశానాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:58 AM
రాష్ట్రంలోని పట్టణ స్థాని క సంస్థల పరిధిలో ఉన్న శ్మశానాలు, సమాధి స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.
హైకోర్టు ఆదేశాలతో చర్యలు చేపట్టిన మున్సిపల్ శాఖ
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థాని క సంస్థల పరిధిలో ఉన్న శ్మశానాలు, సమాధి స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రా థమిక సదుపాయాల లోపంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1803 శ్మశానాలు, సమాధి స్థలాలను స్థానిక కమిటీల ద్వారా నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూడటం ప్రాథమిక బాధ్యతగా భావిస్తూ, సమయపాలనతో కూడిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏవిధమైన నిర్లక్ష్యం జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శ్మశానాలు, సమాధి స్థలాల్లో 15 రోజుల్లోగా మరుగుదొడ్లు, 24 గంటల నిరంతర తాగునీటి సరఫరా, తగిన లైటింగ్ వసతులు కల్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించాలన్నారు. స్థానిక నిర్వహణ కమిటీలను బలోపేతం చేసి ప్రజాప్రతినిధులు, స్థానిక సభ్యులతో కలిసి పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల అమలు కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీఎస్ అధ్యక్షుడిగా, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యకార్యదర్శిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. శ్మశానాలు, సమాధి స్థలాల నిర్వహణ రాజ్యాంగంలోని షెడ్యూల్ 12 ప్రకారం పట్టణ సంస్థల చ ట్టబద్ధ బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.