పారిశ్రామిక ప్రతిపాదనలన్నీ ఆగస్టు నాటికి ‘గ్రౌండింగ్’
ABN , Publish Date - May 08 , 2026 | 05:16 AM
పారిశ్రామిక ప్రతిపాదనలన్నీ ఈ ఏడాది ఆగస్టు నాటికి ‘గ్రౌండింగ్’ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎంఎస్ఎంఈ కార్యకలాపాలు
కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక ప్రతిపాదనలన్నీ ఈ ఏడాది ఆగస్టు నాటికి ‘గ్రౌండింగ్’ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఈ నెలాఖరుకు రానున్నాయని తెలిపారు. ఈ మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా భవనాలను నిర్మించుకోవచ్చన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 ప్రధాన ప్రాజెక్టులు, ఏపీఐఐసీ పార్కుల్లో 3000 ఎంఎస్ఎంఈ ప్లాట్ల స్థాపనకు అవకాశం ఉందన్నారు. ప్రతి ప్రాజెక్టు జిల్లాకు ఆస్తిగా, ఆ జిల్లాలోని యువతకు ఉపాధి మార్గంగా ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనంతపురం, విశాఖపట్నం, అనకాపలి జిల్లాల కలెక్టర్లు భూ కేటాయింపుల విషయంలో ముందంజలో ఉన్నారని, మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా భూములను కేటాయించడంలో వేగాన్ని పెంచాలన్నారు. కొన్ని జిల్లాల్లో వంద రోజులు దాటినా అనుమతులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి యువరాజ్ తీసుకువచ్చారు. ప్రజావసరాలు మినహా మిగిలిన ప్రతిపాదనలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని యువరాజ్ సూచించారు.