Share News

ఎంపీడీవోలకు కొత్త క్యాడర్లపై కసరత్తు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:05 AM

మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)ను కొత్త స్థానిక క్యాడర్లలోకి కేటాయించే ప్రక్రియను పంచాయతీరాజ్‌శాఖ వేగవంతం చేసింది.

ఎంపీడీవోలకు కొత్త క్యాడర్లపై కసరత్తు

  • నాలుగు రోజుల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి

  • ఒకసారి ఇస్తే మార్చే అవకాశం లేదు

  • సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు

అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)ను కొత్త స్థానిక క్యాడర్లలోకి కేటాయించే ప్రక్రియను పంచాయతీరాజ్‌శాఖ వేగవంతం చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తుర్వుల (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌) అమల్లో భాగంగా అందరు ఎంపీడీవోల నుంచి ఆప్షన్‌ ఫారాలను సేకరించాలని కమిషనర్‌ కృష్ణతేజ ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సంబంధించి జూలై 10న జిల్లా పరిషత్‌ సీఈఓలకు మెమో పంపించారు. ఉద్యోగుల తుది సీనియారిటీ జాబితా ప్రకటించిన నాలుగు రోజుల్లోపు ప్రతి ఎంపీడీఓ తనకు నచ్చిన జిల్లా, జోన్‌ లేదా మల్టీజోన్‌కు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి సమర్పించిన ఆప్షన్‌ను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీజోన్లు

1975 రాష్ట్రపతి ఉత్తుర్వుల స్థానంలో 2025 ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రాన్ని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునర్యవస్థీకరించారు. ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల స్థానిక క్యాడర్లను కూడా పునర్విభజించాల్సి ఉంది. ఇందులో భాగంగానే మొదటి ఎంపీడీవోల సీనియారిటీ జాబితా రూపొందించి, వారి ఆప్షన్లు తీసుకుని తుది కేటాయింపులు చేయనున్నారు. ఆప్షన్‌ ఫారం ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించే విధంగా రూపొందించారు.


ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యం

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు క్యాడర్‌ కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగ ఉద్యోగులు, పునర్వివాహం చేసుకోని వితంతువులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన ఉద్యోగులు, క్యాన్సర్‌, మేజర్‌ న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, లివర్‌ మార్పిడి, ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు ఇందుకు అర్హులు. అయితే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆప్షన్‌ ఫారంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సంబంధిత ఉద్యోగిపై ఏపీ సీసీఏ నిబంధనల ప్రకారం మేజర్‌ పెనాల్టీ విధిస్తారు. తప్పుడు వివరాలను ధ్రువీకరించిన అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యం కూడా నిష్పత్తి ప్రకారం ఉండేలా ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కొత్త క్యాడర్‌ స్థానంలో ఎంపీడీవోలు ఏడు రోజుల్లోపు కొత్త స్థానంలో చేరాల్సి ఉంటుంది.

పదోన్నతులు, బదిలీలపై తాత్కాలిక ఆంక్షలు

స్థానిక కేడర్ల పునర్యవస్థీకరణ పూర్తయ్యే వరకు సంబంధిత శాఖల్లో కొత్త నియామకాలు, పదోన్నతులు, సాధారణ బదిలీలు, డిప్యుటేషన్లపై ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలిక ఆంక్షలు విధించింది. క్యాడర్‌ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎంపీడీవోల సేవలు పూర్తిగా కొత్త స్థానిక కేడర్ల వ్యవస్థకు అనుగుణంగా పునర్వవస్థీకరిస్తారు. ఇది 2025 ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అమల్లో అత్యంత కీలకమైన పరిపాలనా దశగా అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 05:08 AM