Share News

మో‘డల్‌’ ప్రైమరీ పాఠశాలలు!

ABN , Publish Date - May 01 , 2026 | 04:23 AM

రాష్ట్రంలోని మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో కనీసం నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. విద్యార్థులు ప్రైవేటు బడుల బాట పట్టడంతో టీచర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది.

మో‘డల్‌’ ప్రైమరీ పాఠశాలలు!

  • తరగతికో టీచర్‌ను ఇచ్చినా ప్రవేశాలు అంతంతే

  • 3,556 బడుల్లో 60 మంది లోపే విద్యార్థులు

  • వంద మంది దాటిన స్కూళ్లు 18.5 శాతమే

  • ప్రవేశాలు మెరుగ్గా ఉన్నది ఆరు జిల్లాల్లోనే

  • ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైఫల్యం

  • రెండేళ్ల తర్వాత మెరుగైన ఫలితాలు: టీచర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో కనీసం నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. విద్యార్థులు ప్రైవేటు బడుల బాట పట్టడంతో టీచర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు పట్టుమని పది మంది పిల్లలు కూడా లేకుండా సాగుతున్నాయి. ఈ దుస్థితిని మార్చి ప్రాథమిక పాఠశాలలకు పూర్వవైభవం తేవాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి మోడల్‌ ప్రైమరీ పాఠశాలలను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 9,620 బడులను గుర్తించి మోడల్‌ ప్రైమరీ పాఠశాలలుగా మార్చింది. వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్‌ చొప్పున కేటాయించింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. మొత్తం 9,620 పాఠశాలల్లో కేవలం 1,775 (18.5శాతం) బడుల్లో మాత్రమే విద్యార్థుల సంఖ్య వంద దాటింది. మరో 3,556 (37శాతం) పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 దాటలేదు. మోడల్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 5 తరగతులు ఉంటాయి. ప్రధానోపాధ్యాయుడితో సహా ప్రతి తరగతికి ఒక టీచర్‌ను ఇవ్వాలన్నది ఉద్దేశం. అయితే 60 మందిలోపు విద్యార్థులున్న బడుల్లో నలుగురు టీచర్లను మాత్రమే కేటాయించారు. అంతకుముందు ఇద్దరే టీచర్లున్న పాఠశాలల్లో వీరి సంఖ్య ఒకేసారి రెట్టింపైంది. 60 మంది విద్యార్థులు దాటిన బడుల్లో ఐదుగురు టీచర్లను కేటాయించారు. ఈ చర్యలతో బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల్లోనే విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉంది.


మూడు జిల్లాల్లో మరీ తక్కువ

రాష్ట్రంలోని మూడు జిల్లాలు విద్యార్థుల సంఖ్య విషయంలో మరీ వెనకబడిపోయాయి. కోనసీమ జిల్లాలో సగటున 57.5 మంది, పార్వతీపురం మన్యంలో 57.7 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 58.8 మంది విద్యార్థులున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఒక్కో పాఠశాలలో సగటున 132 మంది ఉన్నారు. ఎన్‌రోల్‌మెంట్‌ పెంపులో ఈ జిల్లా మంచి ప్రగతి సాధించింది. దీనితో పాటు అనంతపురం, నంద్యాల, ఎన్టీఆర్‌, పల్నాడు, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే విద్యార్థుల సంఖ్య 80 దాటింది. మొత్తంగా 7,56,193 మంది విద్యార్థులు మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ వ్యవస్థ మెరుగుపడాలంటే కనీసం రెండేళ్ల సమయం కావాలని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి రేషనలైజేషన్‌ చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తే పిల్లలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కొత్త విధానాన్ని ఈ ఏడాదే ప్రారంభించడంతో తగినంత ప్రచారం లభించలేదు. తరగతికి ఒక టీచర్‌ ఉన్నారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. స్థానికంగా టీచర్లు, ప్రజలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన జిల్లాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా నూతన విధానంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తే పిల్లల్ని ఆ బడులకు పంపొచ్చన్న భరోసా తల్లిదండ్రుల్లో ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 01 , 2026 | 04:23 AM