Share News

అనంతబాబు అరెస్టు

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:42 AM

దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అనూహ్య రీతిలో అరెస్టు చేశారు. సాక్షులను బెదిరించిన వ్యవహారంలో ఆయన అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అనంతబాబు అరెస్టు

  • నాలుగు రోజులుగా పరారీలో ఎమ్మెల్సీ

  • రాజమండ్రి కోర్టు వద్ద హఠాత్తుగా ప్రత్యక్షం

  • కారులోంచి దిగీ దిగగానే కోర్టులోకి పరుగు

  • డ్రైవరు హత్య కేసులో విచారణకు హాజరు

  • కోర్టులోంచి బయటకు వస్తుండగా అరెస్టు

  • ఏసీ జీపులో కాకినాడకు తరలింపు

  • స్వామిభక్తి ప్రదర్శించిన పోలీసులు!

  • అనంతబాబుపై అర్ధరాత్రి వరకు ప్రశ్నలవర్షం

  • నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అనూహ్య రీతిలో అరెస్టు చేశారు. సాక్షులను బెదిరించిన వ్యవహారంలో ఆయన అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కళ్లు కప్పి నాలుగు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టు వద్ద హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. హత్య కేసులో కోర్టు విచారణ కోసం ఉదయం 10.20 గంటలకు కారులో ఆయన వచ్చారు. కోర్టు ప్రాంగణంలో కారు ఆగీ ఆగగానే కోర్టు హాలులోకి పరుగులు పెట్టారు. రెండో నిందితురాలిగా ఉన్న ఆయన భార్య లక్ష్మీ దుర్గ అప్పటికే కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేయడంతో ఎదురుగా ఉన్న మరో కోర్టు భవనంలోకి వెళ్లి న్యాయవాదులు వేచిఉండే గదిలో వారిద్దరూ కూర్చున్నారు. అప్పటికే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడ సాంకేతిక లోపం తలెత్తడంతో క్వాష్‌ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. దీంతో అరెస్టు అనివార్యమైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన లాయర్లతో అనంతబాబు కోర్టు ప్రాంగణం బయటకు రావడంతోనే పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ సదుపాయం ఉన్న పోలీస్‌ జీప్‌లో ఆయనను కాకినాడకు తరలించారు. సాధారణంగా నిందితులను పోలీస్‌ వ్యాన్‌లో తరలించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా పోలీసులు స్వామి భక్తి చూపించడం కొసమెరుపు. అనంతబాబు తన లాయర్లతో కలిసి కోర్టు హాలులోకి పరుగెత్తడం తొలిసారి ‘ఏబీఎన్‌’లో ప్రసారమైంది. అది చూసిన స్థానిక పోలీసులు అనంత బాబును పట్టుకునేందుకు పరుగెత్తారు.


  • ఎందుకు పరారయ్యారు?

  • ఈ నాలుగురోజులు ఎక్కడున్నారు?.. సాక్షులను ఎందుకు బెదిరించారు?

  • అనంతబాబుపై అర్ధరాత్రి వరకు ప్రశ్నలవర్షం

  • నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

కాకినాడ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): నాకు తెలియదు.. గుర్తు లేదు...! డ్రైవరు హత్య కేసులో సాక్షులను బెదిరించి దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు ఇచ్చిన జవాబులివి. ఎందుకు పరారయ్యావు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు.. అంటూ 30 ప్రశ్నలు వేసినా, ఆయన తీరులో మార్పు లేదు. ఐదు ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చారు. మిగతా ప్రశ్నలు అడిగినప్పుడు డొంకతిరుగుడుగా స్పందించారు. అనంతబాబును అరెస్ట్‌ చేసిన పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కాకినాడ రూరల్‌ సర్కిల్‌ పోలీసు కార్యాలయం ఆవరణలోని క్రైం స్టేషన్‌కు తరలించారు. అక్కడ అర్ధరాత్రి వరకు ఉంచి విచారించారు. సాక్షులను ఎందుకు భయపెట్టారు? ఎందుకు ఒక్కో సాక్షికి రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండి సాక్షులను ప్రలోభ పెట్టడం ఏంటి? ఈ విషయంలో ఇంకా మీకు సహకరించింది ఎవరు? కాకినాడలోని మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఏమైనా ఉందా? సాక్షులను బెదిరిస్తే మీ బెయిల్‌ రద్దవుతుందనే విషయం తెలియదా? కేసులో ఏ4 ముద్దాయి మాగంటి రాంబాబు గంజాయి కేసులో ఉన్నారు... ఆయనకు, మీకు మధ్య ఉన్న సంబంధాలేంటి? మిమ్మల్ని పారిపోవాలని ఎవరైనా చెప్పారా? మీ అపార్టుమెంట్‌లో దొరికిన లక్షలాది రూపాయలు ఎవరివి... అంటూ అనేక ప్రశ్నలు అనంతబాబుకు సంధించారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశాం.. మా లాయర్లు అన్నివిషయాలు కోర్టులో చెబుతారని.. పదేపదే అనంతబాబు అన్నట్టు తెలిసింది. కాగా, అనంతబాబును విచారిస్తున్న స్టేషన్‌కు ఆయన లాయర్‌ వచ్చి హల్‌చల్‌ చేశారు. అనంతబాబుతో మాట్లాడాలని, లోపలకు పంపాలని పట్టుబట్టారు. కేసు విచారణాధికారి చెన్న కేశవరావు ఈ ప్రక్రియకు నాయకత్వం వహించారు. విచారణలో అనంతబాబు పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదని తెలిసింది. శనివారం మధ్యాహ్నం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.


  • వైసీపీ సాయానికి మరో ‘సాక్ష్యం’

  • నిందితుడికి ఆశ్రయమిచ్చింది వైసీపీ నేతలే

ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడటానికి వైసీపీ నేతలు తొక్కుతున్న అడ్డదారులను రుజువు చేసే మరో పక్కా సాక్ష్యం దొరికింది. మంగళవారం సాయంత్రం కాకినాడలోని తన అపార్ట్‌మెంట్‌ నుంచి పారిపోయిన అనంతబాబు బైక్‌పై నేరుగా 60కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం చేరుకున్నారు. అక్కడ ఓ వైసీపీ కౌన్సిలర్‌ ఇంట్లో ఆ రాత్రి బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడ రెండురోజులపాటు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి శుక్రవారం నేరుగా కోర్టు దగ్గరకు వచ్చారు.

Updated Date - Apr 25 , 2026 | 04:42 AM