మైనింగ్‌పై ని'బంధనాలు'!
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది మైనింగ్‌లోనే. అంతేగాక ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది.
బఫర్‌జోన్ చిక్కుల్లో మైనర్ మినరల్స్
ఈసీలు నిలిపివేసిన పీసీబీ
స్తంభించిపోతున్న మైనింగ్ వ్యవస్థ
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
ఆందోళనలో లీజుదారులు
సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని వినతి
గ్రామాలు, పట్టణాల పరిధిలో కిలోమీటరు దూరంలో మైనింగ్ చేయకూడదన్నది నిబంధన. జనావాసాలకు దగ్గరగా బ్లాస్టింగ్ చేయరాదు. కానీ రోడ్ మెటల్, గ్రావెల్ వంటి పనులు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని లీజుదారులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కి.మీ. పరిధిలో మైనింగ్ కార్యకలాపాలన్నింటినీ ఆపేసింది. ఎన్‌వోసీలు, ఈసీలు ఇవ్వడం లేదు. రెన్యువల్ చేయడం లేదు. ఇది మైనర్ మినరల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మైనింగ్ వ్యవస్థే స్తంభించిపోతోంది. దీనిపై లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది మైనింగ్‌లోనే. అంతేగాక ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. అయితే గ్రామాలు, పట్టణాల పరిధిలో కిలోమీటరు దూరంలో మైనింగ్ చేయకూడదన్న నిబంధన కలకలం రేపుతోంది. గత 4 నెలలుగా రాష్ట్రంలో చిన్న, సూక్ష్మతరహా ఖనిజాల మైనింగ్ నిలిచిపోయింది. పాత లీజులు నిలిచిపోగా, కొత్తగా అనుమతులు పొందిన వాటికి పర్యావరణ అనుమతిని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిరాకరిస్తోంది. దీంతో లీజుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైనర్ మినరల్స్ మైనింగ్ నిలిచిపోవడంతో గని కార్మికులు, సాంకేతిక సిబ్బంది, నైపుణ్యం కలిగిన కార్మికులు, రవాణాదారులతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామీణ ఆధారిత వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రాజధాని పనులు, ఇతర అభివృద్ధి పనులపై కూడా దీని ప్రభావం పడుతోంది. వాస్తవానికి ఖనిజాలు లభించే ప్రదేశంలోనే మైనింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఖనిజ నిక్షేపాలను ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ మైనింగ్ చేయడం సాధ్యంకాదు. అందువల్ల ఇప్పటికే ఉన్న మైనింగ్ క్లస్టర్‌లు, ఖనిజ ప్రాంతాలను రక్షించే శాస్త్రీయ విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మైనింగ్ ఏరియాలో లే అవుట్!
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జూపూడి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌కు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. అక్కడ బిల్డర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దానికి కూతవేటు దూరంలో నోటిఫైడ్ ఏరియాలోనే గనుల శాఖ మరో మైనింగ్ లీజుకు ఇచ్చింది. అక్కడ మైనింగ్ పనులు మొదలయ్యాయి. భవనాల సమీపంలో మైనింగ్ ఎలా చేస్తారంటూ బిల్డర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు గత మార్చిలో తీర్పు ఇచ్చింది. గ్రామాలకు కిలోమీటరు వరకు బఫర్‌జోన్‌గా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా సీఆర్‌డీఏ, గనుల శాఖ, ఇంకా పలు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. గ్రామాలు, జనావాసాలకు దూరంగా ఉన్నప్రాంతాల్లో మైనర్ మినరల్స్ మైనింగ్ ఇప్పటికీ జరుగుతోంది. కొండలు, గుట్టలు తవ్వడం, రోడ్ మెటల్, ఇంకా కంకర, ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ సీఆర్‌డీఏ పరిధిలో ఈ మైనింగ్ ఏరియా పరిసరాల్లో లే అవుట్లకు అనుమతులు ఇవ్వడంతో సమస్యలు వస్తున్నాయి. మైనర్ మినరల్స్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో లేఅవుట్ అనుమతులు ఇవ్వకూడదన్న నిబంధనలు తీసుకురావాలని లీజుదారులు అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలపై ఇటు సీఆర్‌డీఏ, అటు గనుల శాఖలు అప్పీల్ చేయాలి.
లీజుదారులు గగ్గోలు
హైకోర్టు ఉత్తర్వును కారణంగా చూపి పీసీబీ మైనర్ మినరల్స్ మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు(ఈసీ) ఇవ్వడం లేదు. దీంతో మైనింగ్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన కన్సెంట్ (సీటీఈ), నిర్వహణకు అవసరమైన అనుమతి (కన్సెంట్ టు ఆపరేషన్స్-సీటీవో) జారీచేయడం లేదు. ఉన్నవాటిని నిలిపివేయడంతో పాటు కొత్తగా మంజూరు చేయడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలోని గుర్తింపు పొందిన మైనింగ్ ప్రాంతాల్లోనూ గ్రావెల్, రోడ్‌మెటల్, ఇతర మైనర్ మినరల్స్ తవ్వకాలు జరగడం లేదు. చట్టబద్ధ్దంగా పనిచేస్తున్న గనులను మూసివేయాలని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, కానీ పీసీబీ ఈసీలను ఆపేస్తోందని లీజుదారులు చెబుతున్నారు. పీసీబీ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీజుల పేరిట అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్న గనుల శాఖ.. లీజుదారులకు పీసీబీ నుంచి వస్తున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పీసీబీ అధికారులు సీఎస్ సాయిప్రసాద్‌ను సంప్రదించారు. ఏజీని సంప్రదించి తదుపరి చర్యలపై సలహా తీసుకోవాలని సీఎస్ సూచించారు. అయితే హైకోర్టు నిర్ణయంపై అప్పీలు చేయడానికి పీసీబీ పార్టీ కాదు. దీంతో మైనింగ్‌శాఖ స్పందించింది. సమస్య పరిష్కారం కోసం హైకోర్టులో అప్పీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామాలకు కిలోమీటరు దూరం బఫర్‌జోన్ ఉంటుందన్న హైకోర్టు ఆదేశాల అమలు వల్ల వచ్చే సమస్యలు, సాధకబాధకాల గురించి నివేదించనున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ కోరుతోంది. బఫర్‌జోన్ విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఫెమీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సి.హెచ్.రావు కోరారు.