మత్స్యకారులకు ఏం చేశావ్ జగన్?
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:37 AM
రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాజీ సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. మత్స్యకారులు వ్యతిరేకించి, బహిష్కరించినా..
డిఫెన్స్‌కు భూమితో పిల్లలకు ఉద్యోగాలు
నిలదీసిన మంత్రులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాజీ సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. మత్స్యకారులు వ్యతిరేకించి, బహిష్కరించినా.. నెల్లూరు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అక్కడి మత్స్యకారులు, జనాలు రాకపోవడంతో ప్రకాశం జిల్లానుంచి మత్స్యకారేతరులను సభకు తరలించారని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారు జగన్ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జువ్వలదిన్నె హార్బర్‌లో కొంత భూమిని డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకు ఇచ్చి, ఆ సంస్థలో స్థానిక మత్స్యకార కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మత్స్యకారుల హక్కులను కాలరాసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జువ్వలదిన్నె హార్బర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటాతో చేపట్టాయి. ఇప్పుడది పూర్తిదశకు చేరింది. రాష్ట్రంలో రూ.3,328 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి రాష్ట్ర వాటా ఉపయోగించకపోగా, కేంద్రం వాటా రూ.128కోట్లను పక్కదారి పట్టించారు’’ అని అచ్చెన్న ధ్వజమెత్తారు.
ఐదేళ్లూ నిద్రపోయారా?
జగన్‌పై ఏపీ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ధ్వజం
అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి, ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ కూటమి ప్రభుత్వంపై జగన్ రంకెలు వేస్తున్నార ని ఏపీ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మండిపడ్డారు. ‘‘మత్స్యకారులను మభ్యపెట్టడానికే జగన్ జువ్వలదిన్నెకు వెళ్లారు. తిరిగి అధికారంలోకి రాగానే సాగర్ డిఫెన్స్‌ను వెనక్కు పంపేస్తామని జగన్ చెప్పడం సరికాదు. దానివల్ల మత్స్యకార పిల్లల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. జగన్ భూమి పూజ చేసినంత మాత్రాన హార్బర్లు కట్టినట్టు కాదు. మత్స్యకారుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.’’ అని యాటగిరి రాంప్రసాద్ అన్నారు.