ఆర్థికంగా అగచాట్లు.. అయినా టిప్‌టాప్ ట్రిప్పులు
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:19 AM
మొత్తం తొమ్మిది మందితో కూడిన బృందం ఈనెల 21న సింగపూర్‌కు వెళ్లింది. వారం రోజుల పర్యటన! మంత్రులకు సింగపూర్ ట్రిప్పు ప్రయాణ ఖర్చులే రూ.95.18 లక్షలు! ఇంకా అక్కడ స్టార్ హోటళ్లలో బస, తిండీ, ఇతరత్రా ఖర్చులు అదనం!
ఆరుగురు మంత్రుల ‘శిక్షణ’ యాత్ర
మరో ముగ్గురు అధికారులు కూడా
ప్రయాణ ఖర్చులే రూ.95 లక్షలు
రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ లీడర్‌షిప్, సింగపూర్ పాలనా విధానాలపై శిక్షణ
ఈ అధ్యయనానికి విదేశీ పర్యటనలే అవసరమా!?
దేశీయంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థలు లేవా?
ఆన్‌లైన్ శిక్షణ, తరగతులు ఉండగా ఎందుకీ దుబారా?
అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేశాం. అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది! దుబారాలు తగ్గించాలి. ఒక్కో రూపాయి ఆచితూచి ఖర్చుపెట్టాలి! మొత్తంగా చూస్తే... మింగ మెతుకు లేదు! కానీ... మంత్రులకు సింగపూర్ ట్రిప్పు! ఎందుకయ్యా సామీ అంటే... అక్కడ వాళ్లు వారంరోజులు శిక్షణ పొంది... ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట! అంటే... ట్రైనర్స్ టు ట్రైనర్స్! ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అంటే... పెద్ద ప్రశ్నార్థకమే సమాధానం!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆరుగురు మంత్రులు.. అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్!
ముగ్గురు అధికారులు.. వీరిలో ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, మరో ఇద్దరు జూనియర్ లెవెల్ ఆఫీసర్లు!
మొత్తం తొమ్మిది మందితో కూడిన బృందం ఈనెల 21న సింగపూర్‌కు వెళ్లింది. వారం రోజుల పర్యటన! మంత్రులకు సింగపూర్ ట్రిప్పు ప్రయాణ ఖర్చులే రూ.95.18 లక్షలు! ఇంకా అక్కడ స్టార్ హోటళ్లలో బస, తిండీ, ఇతరత్రా ఖర్చులు అదనం! మొత్తంగా సింగపూర్ ట్రిప్పు వ్యయం మూడు కోట్లు దాటే అవకాశముంది! ఇంత ప్రజాధనం ఖర్చు చేసి వీరేం చేస్తారంటే... అక్కడ శిక్షణ పొంది, ఇక్కడ శిక్షకులుగా వ్యవహరిస్తారట! రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ లీడర్‌షిప్, సింగపూర్‌పాలనా మోడల్ గురించి అధ్యయనం చేసి వస్తారట! అసలే అప్పుల్లో మునిగిన రాష్ట్రం! వేలకోట్లలో బకాయిలు! రోజూ ఆర్థిక కష్టాలు! ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ట్రిప్పులు అవసరమా అన్నదే అసలు ప్రశ్న! మంచి విధానాలు ఎక్కడున్నా నేర్చుకోవాలి. కానీ... నేటి హైటెక్ యుగంలో దీనికోసం దేశాలు తిరగక్కర్లేదు. ఇంటర్నెట్‌లో వెతికితే వందలపేజీల సమాచారం వస్తుంది. ఆయా రంగాల నిపుణులను పిలిపించుకుని ఇక్కడే శిక్షణ పొందవచ్చు. ఆయా దేశాల్లోని ఉత్తమ విధానాలు వివరించేందుకు ప్రభుత్వ రంగంలోనే మానవ వనరుల అభివృద్ధి సంస్థలు, అధ్యయన సంస్థలు చాలానే ఉన్నాయి. ఎక్కడికీ వెళ్లకుండా, ఇక్కడే కూర్చుని సింగపూర్ గురించి బోలెడు విషయాలు నేర్చుకోవచ్చు. ఈ పర్యటనలో మంత్రులకు సింగపూర్‌లో క్లాసులు తీసుకుంటున్న నిపుణులు... అవే క్లాసులను ఆన్‌లైన్‌లోనూ చెప్పగలరు. మరి... కోట్లు ఖర్చుపెట్టి అక్కడికి వెళ్లడం ఎందుకు?
సింగపూర్ గురించి తెలుసుకోవాలా?
సింగపూర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశం. పౌర సేవలు, ప్రభుత్వ పాలనలో అవినీతి చాలా చాలా తక్కువ. ప్రభుత్వాధినేతలు తప్పుచేసినా కఠిన శిక్షలు విధిస్తారు. ప్రజలూ అంతే క్రమశిక్షణతో ఉంటారు. ‘సివిక్ సెన్స్’ పాటిస్తారు. మొత్తంగా... వ్యక్తి కన్నా దేశ ప్రయోజనాలే ప్రథమం (నేషన్ ఫస్ట్) విధానాన్ని పాటిస్తారు. సింగపూర్ ఒక దేశం! ఏపీ... భారతదేశంలో ఒక రాష్ట్రం మాత్రమే! సింగపూర్ విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు అనేక పరిమితులు ఉంటాయి. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేని విధంగా పౌరసేవలు అందించడం, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జీరో కరప్షన్, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులకు తప్పనిసరి నైతిక బాధ్యతలు విధించడం వంటివి అనేక అంశాలు సింగపూర్ నుంచి నేర్చుకోవచ్చు. అయితే, మంత్రులకు ఇచ్చే ట్రైనింగ్ అంశాల్లో అవేవీ లేవు. అదేసమయంలో... ‘రాజకీయ జవాబుదారీతనం’ గురించి శిక్షణ పొందుతారట! అంటే, మన నేతలు, ప్రభుత్వాలకు రాజకీయ జవాబుదారీ తనం లేదని ఒప్పుకోవడమే కదా!
ఏం నేర్చుకుంటున్నారు?
సింగపూర్‌లో మన మంత్రులు పెట్టుబడులు, పరిశ్రమలకు ఆహ్వానం, నగరాలు, పట్టణాల అభివృద్ధి, పోర్టులు, పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలు, వ్యర్థాల నిర్వహణ, వృత్తిపరమైన విద్య, ఫిన్‌టెక్, కృత్రిమ మేధస్సు (ఏఐ)పై శిక్షణ పొందుతున్నట్లు అధికారిక ప్రకటనలు (ప్రెస్ రిలీజ్) వెలువడుతున్నాయి. ఒక వేళ అదే నిజమైతే... ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో చెప్పింది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు! పరిశ్రమలు, పోర్టులు, ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడాలంటే పరిశ్రమల మంత్రి ఆ టూర్‌లో ఉండాలి. ఆ శాఖ కార్యదర్శి లేదా విభాగాధిపతి ఉండాలి. కానీ... వీరెవరూ లేరు. ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి చర్చలు జరపాలంటే ఆ టూర్‌లో ఐటీ, కమ్యూనికేషన్‌ల మంత్రి ఉండాలి. కానీ, ఆ మంత్రీ లేరు. నీటి వనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చలు జరుపుతున్నట్లుగా రిపోర్టులు పంపిస్తున్నారు. సంబంధిత మంత్రులూ ఈ ట్రిప్పులో భాగస్వాములు కారు. సింగపూర్‌లో వ్యవసాయం దాదాపు సున్నా! అలాంటి చోటికి వ్యవసాయ మంత్రి వెళ్లి ఏం చూస్తారు? ఇక ఆ టూర్‌కు వెళ్లిన అధికారులెవరంటే... ఓ ఐఎ్‌్‌ఫఎస్ అధికారి, మరో ఇద్దరు జూనియర్ అధికారులు! ‘శిక్షణ’ అంశాలకు ఫారెస్ట్ అధికారికీ సంబంధమే లేదు. మొత్తంగా చూస్తే... ఇది అధ్యయనం తక్కువ, విహారం ఎక్కువ అన్నట్లుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సింగపూర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలనూ మంత్రులు కవర్ చేస్తున్నారు.
ఇక్కడ ఏం నేర్పిస్తారు?
రాష్ట్రం నుంచి పలు సందర్భాల్లో మంత్రులు, అధికారులు అధ్యయనం పేరిట విదేశాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన అధికారులు ఇక్కడికి వచ్చి ఇతరులకు శిక్షణ ఇచ్చేలోగానే బదిలీ అయిన సందర్భాలున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు విదేశీ పర్యటనలు తగ్గించుకున్నాయి. జూమ్ కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్, ఆన్‌లైన్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్, కృత్రిమ మేధ (ఏఐ) వచ్చాక కీలక అంశాలపై అధ్యయనం, శిక్షణకు స్థానికంగా ఉన్న మానవ వనరులు, ఐటీ విభాగాలనే ఎంచుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇంకా టూర్‌ల పేరిట దుబారా ఆపడంలేదు! కొసమెరుపు ఏమిటంటే... సింగపూర్‌లో నేర్చుకున్న అంశాలపై అధికారులు రిపోర్ట్ ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. కానీ, మంత్రులకు మాత్రం అలాంటిదేమీ లేదు.